కరోనా రెండోదశ మనుషుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు మూడోదశపై నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనేకమంది కొవిడ్ నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. ప్రజల్లో ఆందోళన కనిపించడం లేదు.
ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే..
వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పట్టణవాసులు అనేకమంది కరోనా నిబంధనలను గాలికొదిలేసి తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతకుముందు రోజుకు 20 కేసులు నమోదుకాగా... గత వారం, పది రోజుల్లో 50 వరకు కేసులు నమోదయ్యాయి.