వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల వ్యవధిలో... వరంగల్ అర్బన్ జిల్లాలో 75, వరంగల్ గ్రామీణ జిల్లా, జనగామ జిల్లాల్లో 33, మహబూబాబాద్ 24, ములుగు 14, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో మహదేవపురం మండలంలో ఒక్క రోజే ఐదు కేసులు బయటపడ్డాయి. కేసులు పెరుగుతుండటం వల్ల... పరీక్షలు కూడా పెంచుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రెండున్నర వేల నుంచి 3 వేల వరకు పరీక్షలు చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారులు తెలిపారు. ప్రజలందరూ... కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసులు పెరుగుతున్నాయి... వ్యాక్సిన్ కేంద్రాలు పెరుగుతున్నాయి - corona cases in warangal
కరోనా తీవ్రత పెరుగుతుండడం వల్ల జిల్లా అధికారులు పరీక్షల సంఖ్య కూడా పెంచుతున్నారు. ఇటు వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాల సంఖ్య సైతం పెరుగుతోంది. ఇకపైనా అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
ఇటు వ్యాక్సిన్లు వేసే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మార్చి 1 నుంచి వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇస్తుండగా... మధ్యలో కొంతమంది టీకా వేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. నాలుగైదు రోజుల నుంచి మాత్రం... మళ్లీ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు టీకాలు వేయించుకునేందుకు వస్తున్నారు. ఒక్క అర్బన్ జిల్లాలోనే 17 వేల మంది టీకా వేయించుకున్నారు. శనివారం నుంచి టీకా ఇచ్చే వ్యాక్సిన్ కేంద్రాలను కూడా పెంచుతున్నారు. అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందించేందుకు... సన్నాహాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ఎట్టి పరిస్ధితుల్లో వృథా కాకుండా... టీకాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ కేంద్రాల పెంపుతో... మరింత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాలు ఉన్నాయి.