రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తుండగా.. బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ.. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపేందుకు సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలోని కొవిడ్ బాధితులతో నేరుగా సీఎం మాట్లాడతారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తారు.
మెరుగైన వైద్యసేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వైద్యాధికారులకు సూచిస్తారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్‌డెసివిర్ ఇతర మందుల లభ్యత... కొత్త ప్లాంట్ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. జిల్లాలో కరోనా కేసులు కట్టడికి... యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటారు. అధికారులను దిశానిర్దేశం చేస్తారు. గంటసేపునకు పైగా ముఖ్యమంత్రి ఎంజీఎంలో గడుపుతారు.
సెంట్రల్ జైలు తరలింపుపై..
అంతకుముందు... వరంగల్ కేంద్ర కారాగారాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు. జైలును ఇక్కడ నుంచి తరలించి... ఇదే ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో.. నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపైనా అధికారులతో చర్చిస్తారు. పెద్దాసుపత్రిగా పేరొందిన ఎంజీఎంకు రోజురోజుకీ రోగుల తాకిడి ఎక్కువవుతోంది. అక్కడకు సమీపంలోనే ఉన్న జైలు ప్రాంగణంలో... 73 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో....అత్యుత్తమ వైద్య సేవలతో కొత్త దవాఖానాను నిర్మించేందుకు... ఇప్పటికే సీఎం ఆమోదం తెలిపారు. ఇక్కడ ఉన్న కేంద్ర కారాగారాన్ని... మామ్‌నూర్ లేదా ధర్మసాగర్‌కి తరలించి... యుద్ధప్రాతిపదికన ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన అనంతరం... జైలు తరలింపు...కొత్త ఆస్పత్రి నిర్మాణ చర్యలు ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను... మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు.
పర్యటన వివరాలు...
ఉదయం 11 గంటలకు వరంగల్ చేరుకోనున్న సీఎం... ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లనున్నారు. అటునుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడి పరిస్థితులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వచ్చి భోజనం చేయనున్నారు. రెండింటికి ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించనున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ వెళతారు.
ముఖ్యమంత్రి పర్యటనతో... ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు... మరింత మెరుగైన సేవలందడమే కాకుండా... వారికి భరోసా కలుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొత్త దవాఖానా నిర్మాణంతో... వరంగల్ పరిసర జిల్లా ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చూడండి:ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా...