Challan on Constables: "ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.." అంటూ పోరు పెడుతున్న పోలీసులు.. పాటించకపోతే చలానాలు కూడా అదే రేంజ్లో వసూలు చేస్తున్నారు. హెల్మెట్ లేకపోయినా.. త్రిబుల్ రైడింగ్ చేసినా.. రాంగ్రూట్లో వెళ్తూ కనిపించినా.. ఇలా ఎలాంటి రూల్ను బ్రేక్ చేసినా.. ఫొటో కొడతారు.. చలానా వేస్తారు. మరి ఇదంతా కేవలం సామాన్య ప్రజలకేనా..? అంటే.. "అంత సీన్ లేదు. ఎంతటి వారైనా.. నిబంధనలు పాటించాల్సిందే.." అంటున్నారు అధికారులు. ఒకవేళ పాటించకపోతే.. అందరిలాగానే జరిమానాలు చెల్లించాల్సిందేనని.. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది.
హనుమకొండ జిల్లా అశోకజంక్షన్లో ట్రాఫిక్ ఏసీపీ బాలాస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వాహనాలు ఆపి.. పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా..? పెండింగ్ చలానాలు ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. జరిమానాలేమైనా ఉంటే.. అక్కడే కట్టించుకుంటున్నారు. అదే సమయంలో.. విధులు ముగించుకుని ముగ్గురు కానిస్టేబుళ్లు తమతమ ద్విచక్రవాహనాలపై ఇంటికి వెళ్తున్నారు. వాళ్లను గమించిన ట్రాఫిక్ ఏపీసీ బాలాస్వామి.. ముగ్గురిని ఆపారు.