వృద్ధాప్యంలో ఒంటరైన వారిని తమ అమ్మానాన్నల్లా భావించి పిడికెడు అన్నం పెడుతున్నారు కొందరు ఔత్సాహికులు. ఆసరా లేని ఆ పెద్దవాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమను పంచుతున్నారు. అనాథలైన వారిని దత్తత తీసుకుని అవసరాలు తీరుస్తున్నారు. వారిని అవ్వ, అక్క, తాత అంటూ వరసలు కలిపి పిలుస్తూ.. కుటుంబసభ్యుల్లా ఆదుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తరిస్తున్న ఈ మానవీయ సంస్కృతిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 18 గ్రామాల్లో 42 మంది వృద్ధులకు స్థానికులు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది.
బాలవికాస సంస్థ అనుసంధానకర్తగా ఈ బృహత్కార్యానికి బాటలు పడ్డాయి. సంస్థ వ్యవస్థాపకురాలు బాల థెరిసా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రెడ్డిపాలేనికి చెందిన ఆమె కెనడాకు వెళ్లి ఆ దేశీయుడినే వివాహం చేసుకున్నారు. అక్కడ ‘సోపార్’ అనే పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. తర్వాత వాటిని వరంగల్‌కు విస్తరించారు. ఇప్పటికి 1500 తాగునీటి కేంద్రాలు, మహిళా చైతన్య కార్యక్రమాలు, సేంద్రియ సేద్యం, పిల్లల దత్తత వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆమెను అంతా బాలక్క అంటూ పిలుస్తారు.
మేమున్నామంటూ ముందుకొచ్చి.. :బాల థెరిసా ఓసారి వరంగల్‌కు వచ్చినప్పుడు నిస్సహాయులైన వృద్ధులను చూసి స్పందించారు. వారికి ఊతం అందించాలనే ఆలోచన కలిగింది. అలా వృద్ధుల దత్తత కార్యక్రమానికి సుమారు 15 ఏళ్ల కిందటే బీజం పడింది. బాలవికాసకు మహిళా సభ్యులున్న అన్ని గ్రామాల్లో వృద్ధులకు సాయం అందించడం ప్రారంభించారు. కెనడాలో ఉండే ఓ దాత వీరికి కావాల్సిన సామగ్రి సమకూర్చేవారు. కొన్నేళ్ల తర్వాత ఆ దాత కన్నుమూయడంతో ఈ పథకం సందిగ్ధంలో ఏర్పడింది.