Bandi Sanjay Padayatra ended in Warangal: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. 11 నియోజక వర్గాలు, 5 జిల్లాల్లో 300 కిలోమీటర్ల పాటు సంజయ్ యాత్ర చేశారు. ఆగస్టు 2న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం వరకు 21 రోజులు కొనసాగింది. మూడు విడతలు కలిపి మొత్తం 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,121 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో చివరి రోజు యాత్ర వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. బండి సంజయ్కు స్వాగతం పలికేందుకు యువత, భాజపా శ్రేణులు భారీగా తరలి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో బండి పాదయాత్ర కోలాహలంగా యాత్ర సాగింది.