రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, వాగులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడం వల్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరంతా వాగుల్లోకి చేరి సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మల్కాపూర్‌లో.. 40 మంది కార్మికులు, కుమురంభీం జిల్లా పెంచికలపేట మండలం ఎల్కపల్లి వద్ద తొమ్మిది మంది వరద నీటిలో చిక్కుకున్నారు. సమయానికి స్పందించిన స్థానికులు, అధికారులు తాళ్ల సాయంతో వారిని బయటకు తీశారు.
వరదలో 40 మంది కార్మికులు..
పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల గోదావరిఖని మల్కాపూర్‌కు భారీ వరద నీరు చేరింది. ఈ ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే 40 మంది వరదలో చిక్కుకున్నారు. చుట్టూ భారీగా వరదనీరు చేరటం వల్ల వారంతా పక్కనే ఉన్న భవనంపైకి ఎక్కి తలదాచుకున్నారు. స్నేహితులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. అధికారులు, సిబ్బంది.. తాళ్ల సాయంతో వారందరిని బయటకు తీసుకువచ్చారు.