తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి

ఎన్టీపీసీలో ఏడాదిలోగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. కరోనాతో ఆలస్యమైన సూపర్ థర్మల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే నీటిపై తేలాడే సోలార్ పలకలతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతోంది.

electricity-generation-with-solar-panels-floating-on-water-in-ntpc-ramagundam
ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి

By

Published : Feb 27, 2021, 1:27 PM IST

రాష్ట్రంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటున్నాయి. పునర్వివిభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.10వేల598కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటితో పాటు ఒడిశాలోని మందాకిని కోల్‌ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా చేసే విధంగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని... ప్రస్తుతం శరవేగంగా పనులు సాగుతున్నాయని ఎన్టీపీసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి

800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. మెుదట సాంకేతిక పరిజ్ఞానం మార్పు వల్ల కొంత ఆలస్యమైంది. అనంతరం కొవిడ్‌ కారణంగా నాలుగు, ఐదు నెలలు ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దక్షిణ భారతదేశానికి విద్యుత్‌ వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. మరో రెండు నెలల్లోగా 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పలకలో విద్యుత్‌ ఉత్పత్తి చేయబోతోంది. ఇందుకు సుమారు 424 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటి ఆధారంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలపై నీటిపై తేలియాడే పలకలతో విద్యుత్‌ ఉత్పత్తిని చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. జలాశయం వద్ద దాదాపు 450 ఎకరాల్లో 5లక్షల సౌర ఫలకాలను బిగిస్తున్నారు. థర్మల్ పవర్‌ కంటే ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

మరోవైపు ప్రయోగాత్మకంగా చేపట్టిన సిమెంట్ రహిత రహదారి నిర్మాణాన్ని ఎన్టీపీసీ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 4కోట్లతో కిలో మీటర్‌ మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సిమెంట్ రహిత నిర్మాణంలో బూడిదతో పాటు సోడియం సిలికెట్‌, సోడియం హైడ్రాక్సైడ్‌ కలుపుతారు. ఇలాంటి రహదారులు పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తాయని సునీల్‌కుమార్ వివరించారు.

జియోపాలిమర్‌ రహదారి నిర్మాణంలో 90 శాతం బూడిదను ఉపయోగిస్తున్నారు. దీనికి సిమెంట్‌, ఇతర మిశ్రమాలు అవసరం లేదు. ఇలాంటి మిశ్రమాలను తయారు చేయటానికి కొండలను మైనింగ్‌ చేసి ధ్వంసం చేస్తున్నాం. ఒకసారి బూడిదను ఉపయోగించి మిశ్రమాలు రూపొందిస్తే సహజవనరులు సురక్షితంగా ఉంటాయి.

విద్యుత్ ఉత్పత్తిలో ప్రయోగాలు చేస్తూనే.... పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీపీసీ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details