ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట పసుపు. మరో నెలలో దిగుబడి చేతికి రానున్న తరుణంలో రైతుకు ఎంత ధర రానుంది? ఏ మేరకు డిమాండ్ ఉంటుందనే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది. కిందటేడాది మద్దతు ధర రాజకీయాంశంగా మారింది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం రైతులు వివిధ రూపాల్లో పోరాటం చేయడమే కాకుండా నిజామాబాద్, వారణాసి లోక్‌సభ ఎన్నికల్లోనూ పెద్దసంఖ్యలో పోటీలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించారు.
బాండ్ పేపర్ రాసిచ్చారు..
భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అర్వింద్.. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానంటూ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మరీ హామీ ఇచ్చారు. పసుపు బోర్డు సాధన అజెండాను ఎత్తుకుని గెలుపొందారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత దాదాపు నెలపాటు బోర్డుపై మౌనం దాల్చారు.
పసుపు ఉద్యమం
పసుపు బోర్డు, గిట్టుబాటు ధర డిమాండ్‌లపై మళ్లీ ఉద్యమ కార్యచరణ ప్రారంభించారు. రైతు ఐక్యకార్యచరణ కమిటీ పేరిట ఇటీవల కొందరు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ వెలకటూరు నుంచి పాదయాత్ర ద్వారా.. సంతకాల సేకరణ జరిపి ఆ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.