ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది. నిత్యం జాతీయ రహదారిపై 15వేలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి జిల్లాలో బిక్కనూర్ వద్ద, నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ హైవేపై ఎక్కువగా యూటర్న్ లు, డివైడర్‌లు ఉన్న ప్రాంతాల్లోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అవసరమున్న చోట అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం, గ్రామాల నుంచి నేరుగా హైవే మీదకు వచ్చేలా డివైడర్లు ఇవ్వడమే దుర్ఘటనలకు కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
నిత్యకృత్యంగా ప్రమాదాలు
44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందల్వాయి మండలం గన్నారం కమాన్, ఇందల్వాయి కమాన్ వద్ద ఆయా గ్రామాల నుంచి వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి వచ్చేస్తాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండా మోడల్ పాఠశాల వద్ద, పోలీస్‌స్టేషన్ ఎదురుగా, తెలంగాణ యూనివర్శిటీ కమాన్, క్రిస్టియన్ మెడికల్ కళాశాల, సాంపల్లి వద్ద డివైడర్లు, యూటర్న్‌లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్, సికింద్రాపూర్, ఆర్మూర్ మండలం పెర్కిట్, బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.