తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ పల్లెల్లో మూడొంతులు అక్రమ లే అవుట్లే!

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ చేపట్టగా.. కేవలం 24.5 శాతం లే అవుట్లు మాత్రమే సక్రమమైనవిగా రూఢి అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో 16,22,681 ప్లాట్లున్నట్లు గుర్తించగా ఇందులో అనుమతి లేని 12,14,574 ప్లాట్లను అవగాహనా రాహిత్యంతోనే గ్రామీణ ప్రజలు కొనుగోలు చేశారు.

illegal plots and layouts in telangana
తెలంగాణ పల్లెల్లో మూడొంతులు అక్రమ లే అవుట్లే!

By

Published : Sep 21, 2020, 7:16 AM IST

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మూడొంతుల లే అవుట్లు అక్రమంగా వెలిసినవేనని తేలింది. మొదటిసారిగా పల్లెల్లో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో అనుమతులు లేనివాటిని గుర్తించారు. కేవలం 24.5 శాతం లే అవుట్లు మాత్రమే సక్రమమైనవిగా రూఢి అయ్యింది. 25 శాతం ప్లాట్లకే అనుమతులున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో 16,22,681 ప్లాట్లున్నట్లు గుర్తించగా ఇందులో 12,14,574 ప్లాట్లకు అనుమతులు లేవు. అవగాహనా రాహిత్యంతోనే గ్రామీణ ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

18 శాతం పంచాయతీల్లోనే సక్రమం

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 12,766 పంచాయతీల్లో 2,398 చోట్ల (18 శాతం) మాత్రమే పట్టణ ప్రణాళిక సంచాలకుల(డీటీసీపీ) అనుమతితో వేసిన లే అవుట్లు ఉన్నట్లు తేలింది. గ్రామాల్లో స్థిరాస్తి వ్యాపారులు డీటీసీపీ అనుమతులు లేకుండానే కేవలం పంచాయతీ తీర్మానాలతో వెంచర్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్‌ లేకుండానే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. నిబంధనల మేరకు ఎకరం విస్తీర్ణం ఉన్న వెంచర్‌కు సైతం డీటీసీపీ అనుమతి తప్పనిసరి. 1965లో పట్టణ ప్రణాళిక చట్టం అమల్లోకి రాకముందు గ్రామపంచాయతీలకు డీటీసీపీ లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారముండేది. పట్టణ ప్రణాళికచట్టం వచ్చినప్పటికీ పల్లెల్లో పాలకవర్గాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నందున అక్రమ లేఅవుట్ల దందా మొదలైనట్లు తెలుస్తోంది.

నిబంధనల ప్రకారం పల్లెల్లో లే అవుట్లు వేసే వారు మొదటగా డీటీసీపీ నిబంధనల మేరకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదనంతరం ఆయా లే అవుట్‌ విస్తీర్ణంలో 33 శాతం రోడ్లకు, 10 శాతం భూమిని పంచాయతీ అవసరాలకు దఖలు పరుస్తూ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అప్పుడు పంచాయతీ పాలకవర్గం లే అవుట్లకు అనుమతి మంజూరు చేస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటినే అనుమతి ఉన్న లే అవుట్లుగా గుర్తిస్తున్నారు.

అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల వివరాలు

ఇదీ చదవండిఃభూ దందా: పేర్లు ఇరికించారు.. పత్రాలు చించేశారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details