తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా సోకిన గర్భిణుల ప్రసవాల్లో ఆ ఆస్పత్రులు ఆదర్శం - మహబూబ్‌నగర్‌ ఆసుపత్రి

కరోనా ఉందనే అనుమానంతో నిండు గర్భిణికి వైద్యం అందక అసువులు బాసిన హృదయ విదారక ఘటన రాజధాని నగరంలో ఇటీవల చోటుచేసుకోగా.. పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకూ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రసవాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది. ఆసుపత్రిలో ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేసి కాన్పులు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వచ్చిన వారికీ సత్వర చికిత్స అందిస్తూ పునర్జన్మ ప్రసాదించి.. పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

Those hospitals are ideal for deliveries of corona infected pregnants
Those hospitals are ideal for deliveries of corona infected pregnants

By

Published : May 25, 2021, 7:41 AM IST

నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌ ఆసుపత్రికి నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల నుంచి గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. ఆయా జిల్లాల నుంచి అర్ధరాత్రి వచ్చేవారినీ చేర్చుకుంటున్నారు. కొవిడ్‌ సోకిన గర్భిణులకు సిజేరియన్లు (శస్త్రచికిత్సలు) చేసేందుకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ పర్యవేక్షణలో గైనిక్‌ విభాగం హెచ్‌వోడీ నీలిమాసింగ్‌ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. గత నెలన్నరలో ఈ విభాగంలోని 15 మంది వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. కోలుకున్న అనంతరం తిరిగి విధుల్లో చేరారు.
* ఆసుపత్రిలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య సుమారు 6 వేల ప్రసవాలు జరిగాయి. వీటిలో 3,200 సిజేరియన్లు కాగా.. 2,800 సాధారణ ప్రసవాలున్నాయి. కరోనా వచ్చినవారిలో మొదటి దశలో 74 మందికి, రెండో దశలో 108 మందికి ప్రసవాలు చేశారు.
* అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన ఓ పాజిటివ్‌ గర్భిణికి హిమోగ్లోబిన్‌ 12 శాతానికి గాను 4.4 మాత్రమే ఉంది. డి-డైమర్‌ 2279 ఉంది. వైద్యసిబ్బంది రాత్రంతా శ్రమించి కాన్పు చేయడంతో పాటు ప్రాణాలు కాపాడారు. ఆమెకు 4 యూనిట్ల రక్తం, రెండు యూనిట్ల ప్లాస్మా ఎక్కించారు. అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన మరో గర్భిణికి ఓ-నెగెటివ్‌ గ్రూపు రక్తం అవసరం కాగా.. పోలీసుల సాయంతో ఇతర జిల్లా నుంచి తెప్పించారు.

మహబూబ్‌నగర్‌లో..

మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల నుంచి కొవిడ్‌ సోకిన గర్భిణులు కాన్పుల కోసం వస్తున్నారు. మొదటి దశలో 23 మందికి, రెండో దశలో 101 మందికి కాన్పులు చేశారు. 75 మందికి సాధారణ, 49 మందికి శస్త్రచికిత్స ప్రసవాలు చేశారు. గత నెలలో 39, ఈ నెలలో 62 మంది కొవిడ్‌ సోకిన గర్భిణులకు కాన్పులు చేశారు. రోజూ 8- 10 మంది కాన్పుల కోసం చేరుతున్నారు. సూపరిండెంటెంట్‌ డా.రాంకిషన్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ..

నెలలు నిండిన గర్భిణుల్లో సాధారణంగానే కొంత నీరసంతో పాటు ఆయాసం ఉంటుంది. కరోనా సోకితే రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురై ఇబ్బందులు రెట్టింపవుతాయి. అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ శస్త్రచికిత్స చేస్తున్నాం. కొద్దిగా ప్రమాదంతో కూడుకున్నది. ఇప్పుడు శ్రమిస్తే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేశామని భవిష్యత్తు తరాలకు గర్వంగా చెప్పుకొనే అవకాశం ఉంటుందని జూనియర్‌ వైద్యులకు, సిబ్బందికి చెప్పాను. వారంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. - నీలిమాసింగ్‌, గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ, నిజామాబాద్‌

వైరస్‌ సోకే ప్రమాదమున్నా..

కొవిడ్‌ సోకిన గర్భిణులకు సాధారణ కాన్పులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. శిశువును వేరు చేసే సమయంలో గర్భిణి శరీరం నుంచి వచ్చే రక్తం లాంటివి తాకే అవసరం ఉండదు. శస్త్రచికిత్సలో శ్వాస, ఉమ్మ నీరు, రక్తం ద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది. పీపీఈ కిట్లు ధరించి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పటివరకు మా దగ్గరికి వచ్చినవారిలో ఇద్దరిని మాత్రమే పరిస్థితి విషమంగా ఉండడంతో ‘గాంధీ’కి పంపించాం. కొన్నిసార్లు కాన్పు సమయంలో నాలుగో తరగతి సిబ్బంది భయపడుతూంటే ధైర్యం చెబుతున్నాం. కష్టమైనా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. -డా.పద్మ, గైనకాలజిస్ట్‌, మహబూబ్‌నగర్‌

ఇదీచూడండి: 'ఆయుష్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్ చికిత్స'

ABOUT THE AUTHOR

...view details