కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగమైన సారంగపూర్ పంపుహౌస్ నీట మునిగింది. నిజామాబాద్ శివారులో ఉన్న ఈ పంపుహౌస్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితమే రెండు పంపుల ఏర్పాటు పూర్తయింది. ఈనెలలో ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నారు. మూడో పంపునకు మోటారు బిగించే పనులు సాగుతున్నాయి. ఇటీవలి వరదలకు శ్రీరాంసాగర్ వెనుక జలాలు పంపుహౌస్‌లోకి ప్రవేశించాయి. ఒక్కోటీ 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు మోటార్లు నీటిలో మునిగాయి. కాళేశ్వరం లింక్-7లో మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సారంగపూర్ నుంచి గోదావరి జలాలను మూడుదశల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
నీరు ఎలా లీకై ఉండొచ్చు
సారంగపూర్ పంపుహౌస్ నుంచి 91 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు మూడు పంపులను బిగిస్తున్నారు. వాటి ఎత్తిపోత సామర్థ్యం 2,472 క్యూసెక్కులు. మోటార్లను పంపునకు అమర్చి హౌస్ అడుగు భాగంలో బిగిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు సర్జ్‌పూల్లో అందుబాటులో ఉంటాయి. ఆ నీళ్లు డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా పంపులకు అందుతాయి. పంపు తిరిగినప్పుడు ఆ నీరు ప్రెజర్ మెయిన్ ద్వారా భూ ఉపరితలం పైభాగానికి చేరుకుని సిస్టర్న్ ద్వారా కాల్వలో దుంకుతాయి. ఇంత పకడ్బందీగా నిర్మాణం ఉండాల్సిన చోట సర్జ్‌పూల్ నుంచి లీకై పంపులు మునిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. సర్జ్‌పూల్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉండే గేట్ల వద్ద లీకేజీ, ఇతర నిర్మాణాల వద్ద లోపాలతో నీళ్లు చేరి ఉండొచ్చని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు.
ఇటీవలి భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌కు భారీ వరద వచ్చింది. వెనుక జలాలు భారీగా విస్తరించి ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయి ఒకటిన్నర మీటర్లకు పైగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే కాళేశ్వరం లింక్-7 హెడ్ రెగ్యులేటర్ గేట్లపై నుంచి సారంగపూర్ పంపుహౌస్‌కు వరద భారీగా వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నీటి ఒత్తిడితోనే సర్జ్‌పూల్ నుంచి లీకై పంపుహౌస్‌లోకి వరద వచ్చినట్లు తెలుస్తోంది.
పనుల వేగంపై ముంపు ప్రభావం
ఇప్పటికే పంపుహౌస్ నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంది. 2018నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టినా ఇంకా కాలేదు. ఈ పనులు జరుగుతున్న 20వ ప్యాకేజీ అంచనా వ్యయం రూ. 892.6 కోట్లు. ముంపు నేపథ్యంలో మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంపు హౌస్‌లోకి చేరిన నీటి తోడివేత, మునిగిన పంపుల నుంచి మోటార్లను వేరు చేసి ఆరబెట్టి బిగించడానికి కనీసం రెండు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనూ ఇలా రెండుసార్లు పంపుహౌస్ మునిగింది.
నీటి మట్టం తగ్గాక తోడేస్తాం