Students strike in Telangana University: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా.. ఇంకా సమస్యల సుడిగండంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. నిత్యం ఏదో వివాదంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. తాజాగా యూనివర్సిటీ మరోసారి పోరుబాట పట్టారు. క్యాంపస్‌లో కనీస సౌకర్యాలు లేవంటూ ఆందోళనకు దిగారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తామని వెల్లడించారు. వర్సిటీ లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా విద్యార్థులు అడ్డుకుంటున్నారు. విద్యార్థుల ఆందోళనకు యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. భాజపా డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న నిరసనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచారు.
బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయానికి కనీస రవాణా సౌకర్యం లేదని... సమస్యలు తాండవం చేస్తున్నాయని పేర్కొన్నారు. వీసీ స్పందించే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. తక్షణమే సమస్యలన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన బాలికల హాస్టల్, మెస్‌లో సౌకర్యాలు, స్పోర్ట్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విద్యార్థులు కోరారు. హెల్త్ కేర్ సెంటర్లో వైద్యుడిని నియమించి అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.