కరోనా దృష్ట్యా లాక్‌డౌన్ అమలుతో ఆర్టీసీకి ఆదాయం కరవైంది. మే 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. నిజామాబాద్ రీజియన్ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం ఆరు డిపోల పరిధిలో 711 బస్సులు ఉన్నాయి. అన్ని మార్గాల్లో బస్సులను నడుపుతున్నప్పటికీ.. ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ కనిపించడం లేదు. శానిటైజర్ అందుబాటులో ఉంచడంతోపాటు.. మాస్కులు ఉన్న వారినే బస్సులోకి అనుమతిస్తున్నారు. కరోనా భయంతో అత్యవసర పని ఉండి, సొంత వాహనాలు లేని వారు మాత్రమే బస్సును ఆశ్రయిస్తున్నారు.
పడిపోయిన ఆదాయం..
నిజామాబాద్ రీజియన్‌లోని డిపోల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ తదితర ప్రాంతాలకు బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్, వరంగల్‌కు బస్సులను ఎక్కువగా నడుపుతారు. లాక్‌డౌన్‌కు ముందు వరకు రోజూ రూ.కోటి ఆదాయం వచ్చేది. అదికాస్తా కరోనా దెబ్బతో రూ.25 లక్షల నుంచి రూ.30లక్షలకు పడిపోయిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.