కొవిడ్.. సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించింది. కరోనా ఆపత్కాలంలోనూ లక్షలు దండుకున్న ప్రైవేట్ ఆస్పత్రులను కాదని.. రూపాయి ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన సర్కార్ వైద్యులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇదే సమయంలో అత్యాధునిక వైద్య పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా వైద్యం అందించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచారు.
ధైర్యంగా డెలివరీలు
కొవిడ్ కాలంలో గర్భిణీలు చాలా ఆందోళనకు గురయ్యారు. పుట్టబోయే బిడ్డకూ కరోనా సోకుతుందేమోనని భయపడ్డారు. ఇక డెలివరీ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వైద్యం అందించేందుకు వెనుకంజ వేశాయి. ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. కరోనా సోకి డెలివరీ కోసం వచ్చిన గర్భిణులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పింది. పుట్టబోయే బిడ్డకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంది. ధైర్యంగా డెలివరీలు చేసి తల్లీ బిడ్డలను రక్షించి క్షేమంగా ఇంటికి పంపించింది.
మంత్రి చొరవతో..
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కొవిడ్ సోకిన గర్భిణులను హైరిస్క్ కింద పరిగణించి హైదరాబాద్కు రిఫర్ చేయడం వల్ల అక్కడి గాంధీ, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల మీద భారం పెరిగింది. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ఇక్కడే కొవిడ్ సోకిన గర్భిణులకు ప్రసవం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.