నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 99.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 824 ఓట్లకు గాను 821 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. బోధన్‌కు చెందిన ఓ కౌన్సిలర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. అక్కడ ఖాళీ ఏర్పడింది. ఇక స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు అధికార తెరాస పార్టీ గెలుచుకుని ముందంజలో ఉంది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ వంటి పదవులు గులాబీ పార్టీ ఎక్కువగా గెలుచుకుంది.
మారిన పరిణామాలు..
500 మంది ప్రజా ప్రతినిధుల బలం తెరాసకు ఉండగా కాంగ్రెస్‌కు 140 ఓట్లు, భాజపాకు 84, ఎంఐఎంకు 28 ఓట్లున్నాయి. స్వతంత్రులు 66 మంది స్థానిక పోరులో గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వతంత్రులతో పాటు వివిధ పార్టీల నుంచి తెరాసలోకి వలస వెళ్లారు. ఇక ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత పార్టీ ఫిరాయింపులు మరింతగా పెరిగాయి.
పకడ్బందీ వ్యూహంతో..
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు జెడ్పీటీసీలు, 30 మందికి పైగా ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరారు. భాజపా నుంచి ఒక జెడ్పీటీసీ, ఏడుగురు కార్పొరేటర్లు, పలువురు ఎంపీటీసీలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. 90 శాతం మంది ఇండిపెండెంట్లు కూడా కారెక్కేశారు. దీంతో తెరాస బలం మరింత పెరిగింది. పకడ్బందీ వ్యూహంతో గులాబీ నేతలు ఈ ఎన్నికల్లో ముందుకు సాగారు. అటు కమలం, ఇటు హస్తం పార్టీ ఓట్లకు గాలం వేస్తూ వారికి గులాబీ కండువా కప్పడంలో సఫలమయ్యారు. క్రాస్ ఓటింగ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు.