ఒకప్పుడు కులవృత్తులు ఓ వెలుగు వెలిగాయి. ఆధునిక జీవన మార్పులతో రానురానూ వాటిని వదిలేసి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. కులవృత్తులు మళ్లీ పూర్వ వైభవం దిశగా సాగుతున్నాయి. ఉపాధి హామీ, హరితహారం పథకాలను వినియోగించుకుని నిజామాబాద్ జిల్లాలో ఈత వనాల పెంపకం మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా గీతకార్మికులు.. కులవృత్తుల్ని నమ్ముకుని ఉపాధి ఎలా పొందాలో యువతకు చూపిస్తున్నారు.
అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లాలో గీతకార్మికులు అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఈతవనాలు పెంచుతున్నారు. ఆ మొక్కల నిర్వహణ సైతం ఉపాధి హామీ కింద చేస్తున్నారు. నీరు పట్టడం, చెత్తను తీసేయడం వంటి పనులను ఉపాధి హామీ కింద చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 ప్రాంతాల్లో 95వేల మొక్కలు నాటించారు. చాలా చోట్ల ఈ ఏడాదిలో కల్లునిచ్చే దశకు చెట్లు ఎదిగాయి. ఈత వనాల పెంపుతో ఉపాధి లభించి వలసలకు అడ్డుకట్ట పడుతుందని గీత కార్మికులు భావిస్తున్నారు.