MLC Kavitha on BJP: కేంద్రం కుట్రపూరితంగా ఉచితాలు వద్దని ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి కవిత పాల్గొన్నారు. మోదీ రూ. 10లక్షల కోట్లు తన మిత్రులకు పంచి పెట్టారని అన్నారు. కానీ ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు(పింఛన్, రేషన్, షాదీ ముబారక్) ఇవ్వొద్దంటున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య నిజామాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణానికి వెళ్లి మోదీ ఫొటో పెట్టలేదని గొడవ పడ్డారని ఆమె మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద, యూరియా బస్తాల మీద మోదీ ఫోటోలు కచ్చితంగా పెడతాం అని కవిత పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒకరకమైన ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. వాట్సాప్‌లో వచ్చే వాటిని యువకులు ఖండించాలన్నారు. ధరలు కేసీఆర్ పెంచలేదు కదా.. పక్కన ఉన్న మహారాష్ట్రలో పప్పులు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మనం గమనించాలని పేర్కొన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.. ఆ నమ్మకం తనకు ఉందని అని కవిత అన్నారు.