Minister prashanth reddy comments: ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస తలపెట్టే పోరాటంలో రైతులంతా కలిసి రావాలని కోరారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ రూపాల్లో చేపట్టనున్న నిరసనల్లో పాల్గొని కేంద్రానికి తమ సత్తా తెలియజేద్దామన్నారు.
"తెలంగాణపై కక్ష పెట్టుకొని రెండేళ్లుగా కేంద్రం పేచీలు పెడుతోంది. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని.. ఇపుడు ఎందుకు వద్దంటున్నారు..? దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్గోయల్ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండని చులకన చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై తెరాస చేస్తున్న ఉద్యమంలో రైతులంతా కదిలిరావాలి. మనల్ని అవమానపర్చిన కేంద్రానికి మన నిరసన సెగ తాకేలా చేయాలి." - వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి