తెలంగాణ

telangana

ETV Bharat / city

జటిలమవుతున్న భూసమస్యలు... కారణాలివే! - జఠిలమవుతున్న భూసమస్యలు... కారణాలివే

ప్రభుత్వం భూప్రక్షాళన చేపట్టినా సామాన్య ప్రజలు, రైతుల భూసమస్యలు మాత్రం తీరడం లేదు.  రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా చిన్న సమస్యలకు కూడా నెలల సమయం పడుతోంది. నిజామాబాద్​లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా పాలనాధికారికి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూ సమస్యలపైనే.

జఠిలమవుతున్న భూసమస్యలు... కారణాలివే

By

Published : Nov 19, 2019, 11:37 PM IST

జటిలమవుతున్న భూసమస్యలు... కారణాలివే!
ప్రభుత్వం రాష్ట్రంలోని భూసమస్యలకు చరమగీతం పాడాలని నిర్ణయం తీసుకుని రెండేళ్లయినా.. రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదు. అందుకోసం ప్రతి గ్రామంలో భూసర్వే నిర్వహించారు. వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రైతులకు పట్టాలను అందించారు. అయితే భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేసే క్రమంలో చేసిన చిన్న తప్పిదాలే రైతులకు శాపంగా మారుతున్నాయి.

సమస్యలు చిన్నవి అయినప్పటికీ పరిష్కారానికి మాత్రం ఏళ్లు గడవాల్సిన పరిస్థితి. ఫలితంగా కొందరు రైతులు ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు జిల్లా రెవెన్యూ అధికారులకూ చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఆన్​లైన్​ నమోదులో జరుగుతున్న తప్పిదాలు...

  • భూముల విస్తీర్ణం సరిగా వేయకపోవడం
  • ఒకరి పేరుకు బదులు వేరొక పేరును నమోదు చేయడం
  • ఇంటి పేరు మారడం
  • సర్వే నంబర్‌ తప్పుగా నమోదు చేయడం
  • వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా చూపడం
  • రైతుల భూమిని ప్రభుత్వ భూమిగా చూపడం
  • పట్టా భూమని అటవీ భూమిగా చూపడం

అందుబాటులో లేని ధరణి వెబ్​సైట్

భూముల వివరాల నమోదులో చేస్తున్న తప్పిదాలను సవరించుకునేందుకు నిత్యం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అన్నదాతలు. ధరణి వెబ్‌సైట్‌ నిత్యం అందుబాటులో ఉండకపోవడం... కొన్ని మార్పులకు అవకాశాలు లేకపోవడం వల్ల సమస్యలు జటిలం అవుతున్నాయి. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగడంతో పాటు అధికారులను నిలదీస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కొంత మంది రైతులు ఆవేశంతో పురుగుల మందుడబ్బాలతో కార్యాలయాలకు వస్తున్నారు.

నిజామాబాద్​లోని మూడు డివిజన్లలో సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటన తర్వాత జిల్లా రెవెన్యూ అధికారుల్లోనూ కలవరం మొదలైంది.

తమకు బదిలీ అవుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులు భూసమస్యల జోలికి పోవట్లేదు. ఎంట్రీ సమయంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని వివాదాస్పద భూముల పైన నేతల ఒత్తిడి ఉండడం వల్ల వెనుకడుగు వేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల సమస్యను గ్రామస్థాయిలోనే అక్కడికక్కడే సరిచేస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మండల స్థాయిలో రెవెన్యూ మేళాలు పెడితే భూసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details