తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2020, 8:00 PM IST

ETV Bharat / city

ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు

అక్కడ ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే. ప్రకృతి పులకరించినట్లుగా ఉండే పచ్చని చెట్లు.. మధురానుభూతిని పంచుతాయి. దట్టంగా పెరిగిన వృక్షాలు మనసుకు హాయిని కలిగిస్తాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని పందిరిలా పరుచుకున్నాయి. అధికారుల చొరవ, సిబ్బంది కృషితో.... హరిత మార్కెట్‌గా భాసిల్లుతున్న నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుపై ప్రత్యేక కథనం.

nizamabad agricultural market
ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు

ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు

నిజామాబాద్ నగరం నడిబొడ్డున వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది. పసుపు, ఇతర పంట ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలు కేంద్రమిది. హరితహారంలో భాగంగా 2016లో మార్కెట్‌ ఆవరణలో అత్యధిక మొక్కలు నాటారు. ఖాళీప్రదేశం కనిపించిన చోటల్లా అధికారులు రకరకాల మొక్కలు నాటించారు. నాటే సమయంలోనే మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని సిబ్బంది నిర్ణయించారు. రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పెట్టడం, చెత్తచెదారం తీసేయడం, కంచె ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా మొక్కలను కాపాడుకున్నారు. నాలుగేళ్లలోనే మొక్కలు ఏపుగా పెరిగి.... మార్కెట్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి.

సుమారు 25 వేల మొక్కలు..

మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరిగే షెడ్లు, సిమెంటు దారుల్లో తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ప్రధాన కార్యాలయం, రైతు విశ్రాంతి భవనం, మార్కెట్ వెనుక ఖాళీ ప్రదేశం, ప్రహరీ గోడ చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో 25వేలకు పైగా మొక్కలు నాటారు. సాధారణ మొక్కలతో పాటు టేకు, కానుగ, మామిడి, జామ, దానిమ్మ, ఉసిరి, నిమ్మ, గుల్మోరా వంటి వాటిని అధిక సంఖ్యలో నాటారు. ఇందులో 10 వేలకు పైగా టేకు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో మొక్కలను బతికించేందుకు ప్రత్యేకంగా నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి.... నీళ్లు పెట్టేందుకు ప్రత్యేక సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు.

ఇక్కడి స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం మార్కెట్‌కు వచ్చే రైతులు, స్థానికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. అధికారుల చొరవ, సిబ్బంది కృషితో ప్రకృతి వనంగా విరాజిల్లుతున్న ఈ క్రయవిక్రయ కేంద్రం.... మిగతా యార్డులకూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీచూడండి:రోజుకు 24కి.మీ సైకిల్​ తొక్కుతూ విజయ తీరాలకు...

ABOUT THE AUTHOR

...view details