తెలంగాణ

telangana

ETV Bharat / city

బాసర ఘటనపై సర్వత్రా విమర్శలు.. మంత్రిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ - Basara RGUKT Students Food Poison

Basara Students Food Poison: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆస్వస్థతకు గురైన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలు పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే తీసేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

Demand to dismiss the minister in Basara Students Food Poison Incident
Demand to dismiss the minister in Basara Students Food Poison Incident

By

Published : Jul 16, 2022, 1:24 PM IST

Basara Students Food Poison: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో.. 9 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు. మరో నలుగురు విద్యార్థులకు వైద్యం అందిస్తుండగా.. కోమలి అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. యూనివర్సిటీలోని పీయూసీ-1, పీయూసీ-2 మెస్‌లలో మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్న 600 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్‌, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా.. స్టూడెంట్స్‌ వెల్ఫేర్ డీన్ రంజిత్‌కుమార్ ఫిర్యాదుతో ఆ రెండు మెస్‌లపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్క ఠాగూర్​ స్పందించారు. రాష్ట్రంలోని విద్యార్థులను విద్యాశాఖ మంత్రి పట్టించుకోవటం లేదని.. ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోని తెరాసకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. జేబులు నింపుకోవటంపైనే రాష్ట్ర సర్కారుకు శ్రద్ధ ఉందని.. ప్రజల సంక్షేమంపై ఎలాంటి పట్టింపు లేదని దుయ్యబట్టారు.

"రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థులను పట్టించుకోవడం లేదు. ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణను పట్టించుకోని తెరాసకు రోజులు దగ్గర పడ్డాయి. జేబులు నింపుకోవడంపైనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉంది. కుమారుడు, అల్లుడు రాజ్యం అంతమవ్వాలి." -మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​

నిజామాబాద్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్​ ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ప్రవీణ్​కుమార్​ మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్​ చేసి.. మెస్​ నిర్వాహకులపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

"నిన్న రాత్రి భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్వీర్య చేస్తోంది. గతంలో సీఎంకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు. వైస్‌ ఛాన్స్‌లర్ లేరు.. కామన్ మెస్ ఉంది. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. మెస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రతిపక్షాలు కేసీఆర్‌తో ములాఖత్ అయ్యాయి." - ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులకు ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరాకరించిన ఆసుపత్రిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన వెంకట్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్‌ ఐటీని బీజేవైఎం, వైతెపా శ్రేణులు ముట్టడించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ నినాదాలు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు.. బీజేవైఎం, వైతెపా శ్రేణులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు విద్యార్థుల ధర్నాకు దిగారు. రెండు మెస్‌లలో లభ్యమైన నాసిరకం సరుకులతో విద్యార్థుల ఆందోళన చేశారు.
కాలం చెల్లిన సరుకులతో వంట చేస్తున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details