Severe damage due to Heavy floods: భారీ వరదలు మిగిల్చిన విషాదం.. బాధిత ప్రాంతాల్లో కళ్లకు కడుతోంది. మంచిర్యాలలోని పలు కానీలలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఒకటో అంతస్తు వరకూ వరద నీరు చేరడంతో.. ఇళ్లలో వస్తువుల్ని బురదమయమయ్యాయి. చెత్త చెదారాన్ని కాలనీవాసులు శుభ్రం చేసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, బియ్యం తడిసిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో సరుకు మొత్తం వరద నీటికి తడిసి పోసింది. రాంనగర్ లోని ఇళ్లలో మొదటి అంతస్తులోకి నీరు రావడంతో గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయాయి. ముంపు కాలనీలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు... బాధితుల్ని ఓదార్చారు.
నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల-తాటిగూడ మధ్య నిర్మించిన వెంతెన కడెం వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. పసుపుల, కొలాంగూడ, హరిచంద్ తాండా, తులసీపేట్, వెంకంపోచంపాడ్, అంకెన, రాయదారి, పోచంపల్లి , గురకలేగి గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత నది ఉద్ధృతితో మహారాష్ట్ర, మంచిర్యాల జిల్లా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాపనపల్లి-సిరోంచ మధ్య నిర్మించిన వంతెన.. సిరోంచ వైపు అప్రోచ్ రోడ్డు కుంగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగించే వ్యాపారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వంతెనపై రహదారి ధ్వంసం అయ్యింది. బోధన్ మండలం పెగడపల్లి శివారులో వంతెన దెబ్బతింది. అధికారులు రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ వాగుపై రెండు నెలల క్రితం నిర్మించిన లోలెవల్ వంతెన కొట్టుకుపోయింది. నాసిరకం పనులతో నిర్మించిన రెండు నెలలకే కొట్టుకు పోయిందని స్థానికులు అంటున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో వరదలకు అనేక గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఇళ్లు, వ్యాపార వాయిద్య సముదాయాలు జలమయం అయ్యాయి. విద్యుత్ నియంత్రికలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. మంథని గోదావరి తీరంలో ఉన్న శివుని విగ్రహం నేల మీద పడి పోయింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గోదావరి తీరంలో పరిస్థితిని పరిశీలించారు.