ప్రస్తుతం కరోనా వైరస్ అనగానే చాలామందిలో ఎన్నో రకాల భయాలు.. ఎన్నో సందేహాలు మదిలో మెదులుతాయి. ఎక్కడ వైద్యం అందిస్తారు, ఎవరినీ సంప్రదించాలన్న విషయంపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి భరోసా కల్పిస్తోంది నిజామాబాద్ కలెక్టరేట్లోని కొవిడ్ సహాయ కేంద్రం. ఆ హెల్ప్‌డెస్క్కిఫోన్ చేస్తే అధికారులు వారిసమస్యలు తెలుసుకొని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ముగ్గురు వైద్య సిబ్బందితోపాటు....., ఓ రెవెన్యూ అధికారి అందుబాటులో ఉంటున్నారు. వచ్చిన ఫిర్యాదుల్ని నమోదు చేయడం.... సమస్యను సంబంధిత అధికారికి తెలియచేస్తూ బాధితుల సమస్య పరిష్కారమయ్యేలా చూస్తున్నారు.
ఏదైనా సమస్య ఉంటే..
గత నెల 19న కలెక్టర్ నారాయణరెడ్డి ఈ కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 500మంది వరకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారని అధికారులు వివరించారు. అందులో 300మంది వరకు పాజిటివ్ వచ్చినవారు ఉండగా మిగిలిన వారు కొవిడ్ పరీక్ష, టీకా కేంద్రాలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పాజిటివ్ నిర్ధరణ అయితే వైద్యసేవలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ మందులు వేసుకోవాలి, క్వారంటైన్, టీకా కేంద్రాల వివరాలు ఎక్కువగా అడుగుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మండల వైద్యాధికారికి పంపిస్తున్నారు.