కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిజామాబాద్ జిల్లా అధికారులు నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. గతంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేవారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సమస్యలు విన్నవించేందుకు మార్చి నుంచి అవకాశం లేకుండా పోయింది.
కరోనా ఎఫెక్ట్: నిజామాబాద్ కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టె - నిజామాబాద్ వార్తలు
కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజలను కలిసేందుకు, వారి సమస్యలు వినేందుకు అధికారులు జంకుతున్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలు కూడా కరోనా కారణంగా సరిగ్గా జరగడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నిజామాబాద్ కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టెను అధికారులు ఏర్పాటు చేశారు.
కరోనా ఎఫెక్ట్: నిజామాబాద్ కలెక్టరేట్లో ఫిర్యాదుల కోసం పెట్టె
ప్రజలకు అందించే సేవలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు కలెక్టరేట్ ఆవరణలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేశారు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కలెక్టరేట్‌కు సమస్యల పరిష్కారానికి వచ్చే వారు.. అధికారుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని, తమ సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేసి వెళ్తే సరిపోతుందన్నారు. ఉదయం నుంచి వచ్చిన ఫిర్యాదులను సాయంత్రం బాక్స్ తెరిచి, ఆయా శాఖలకు పంపుతామని తెలిపారు.