నిజామాబాద్లో ప్రతి గురువారం నాటుకోళ్ల సంత జరుగుతుంది. పులాంగ్ చౌరస్తాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. కొనుగోళ్లతో ఈ ప్రాంతమంతా సందడిగా మారుతుంది. బరువును బట్టి ఒక్కో కోడి ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతుంది. పెట్ట, పుంజులకు వేర్వేరు ధరలుంటాయి. పెట్టకు సుమారు రూ.350, పుంజుకు రూ.500 నుంచి రూ.600 వరకు పెడుతుంటారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నాటుకోళ్లను విక్రయిస్తుంటారు.
పందెం కోళ్లతో కళకళ...
సంక్రాంతి నేపథ్యంలో నాటుకోళ్ల సంత... పందెం కోళ్లతో కళకళలాడుతోంది. రెండు మూడు వారాలుగా సంతకు నాటుకోళ్లతో పాటు పందెం కోళ్లనూ తీసుకొస్తున్నారు. జాతి కోళ్లను సంక్రాంతి సందర్భంగా పందెం కోసం కొనుగోళ్లు చేస్తుంటారు. పందెం కోళ్ల ధర రూ.2 వేల నుంచి 12 వేల వరకు పలకుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో పలికే ధరలతో పోలిస్తే... ఇక్కడ సగం రేటుకే పందెం కోళ్లు లభిస్తాయి. ఏడాది ముందు నుంచే వీటిని బలంగా తయారు చేస్తుంటారు. నెమలి, కాకు, బెర్స, డేగ, పర్ల, గరిడె తదితర రకాల కోళ్లు సంతలో లభిస్తాయి. వీటిల్లో బెర్స, పర్ల, డేగ రకాలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇవి పందెంలో బాగా పోటీ పడుతాయని ప్రజల నమ్మకం. వీటికి సజ్జలు, రాగులు, జీడిపప్పు, బాదం పలుకులు పెట్టి పెంచుతారు. రకాన్ని బట్టి ఒక్కో కోడికి రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు ఖర్చు అవుతుందని అమ్మకందారులు చెబుతున్నారు.