అపార్టుమెంటులో ఆనందంగా..
హైదరాబాద్‌లోని గూగుల్‌లో రెండేళ్లుగా పని చేస్తున్నాను. బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనడం అంటే ప్రాణం. ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉండటంతో పండగలో పాల్గొనలేకపోయాను. ఈసారి పండగ జరిగే అన్ని రోజులు బతుకమ్మను పేర్చడం, పాటలు పాడుతూ..నృత్యం చేయడం ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో..లేదో. అందుకే మా అపార్టుమెంటు వాసులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నా.
- మౌనిక, అశోక్ రెసిడెన్సీ, వినాయక్‌నగర్
మూడేళ్లుగా ఎదురు చూశాం...
హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నాం. మాకెంతో ఇష్టమైన పండగ బతుకమ్మ. తీరొక్క పూలు తీసుకొచ్చి రంగులు అద్ధి.బతుకమ్మగా పేర్చేవారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉండటంతో మూడేళ్లుగా వేడుకలకు దూరమయ్యాం. ఈసారి ఇంటి పట్టునే ఉంటుండటంతో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నాం. జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వేడుక ఇది. మనదైన సంస్కృతిని చాటే బతుకమ్మను ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. పూలను పూజించే ఈ ఉత్సవం ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ మహిళలకే ప్రత్యేకమైన ఈ సంస్కృతిని భావితరాలకు అందించాలి. బతుకమ్మ పాటలు నిత్యజీవితంలోని కష్ట, నష్టాలను చాటుతాయి.
- మానస, భార్గవి(అక్కాచెల్లెళ్లు), నిజామాబాద్