నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన చందూరు భోజన్న కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ తాను సంపాదించిన డబ్బులు అదే గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉన్న భార్య లక్ష్మీ ఖాతాలో వేసేవాడు. కొన్నిరోజుల తర్వాత భోజన్న సోదరుడు భోజన్న వదిన అయిన లక్ష్మిని విదేశాలకు వెళ్లేందుకు బ్యాంకులో రుణం తీసుకుంటున్నానని, అందుకు నీ సంతకం కావాలని ఆమెను కోరాడు. వ్యవసాయ పట్టాదారు పాసు పుస్తకాలు కూడా కావాలని కోరాడు. మరిది భోజన్నకు సాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్మీ ఏమీ ఆలోచించకుండా పాసు పుస్తకం ఇచ్చి, సంతకం చేసింది. ఇదే అదునుగా భోజన్న రూ. లక్షా 10 వేలు పంట రుణానికి దరఖాస్తు చేశాడు. 2018 ఏప్రిల్ నెలలో అధికారులు ఆమె ఖాతాలో ఆ డబ్బులు జమ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భోజన్న ఆ మొత్తాన్ని తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు.
భూమే లేదు.. రుణమెలా ఇచ్చారు?
విదేశాల నుంచి వచ్చిన లక్ష్మీ భర్త భోజన్న తాను జమ చేసిన డబ్బు తీసుకునేందుకు భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. నగదు కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు నగదు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా.. సదరు మహిళ రూ.లక్షా 10 వేలు పంట రుణం తీసుకుందని చెప్పారు. బ్యాంకు అధికారులు మాటలు విన్న భార్యభర్తలు అవాక్కయ్యారు. అసలు లక్ష్మీ పేరు మీద వ్యవసాయ భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రామస్తులు సైతం భోజన్న, లక్ష్మీలకు మద్ధతు పలికి బ్యాంకు అధికారులను నిలదీయగా.. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఆరా తీశారు. భోజన్న తమ్ముడి పేరు కూడా భోజన్నే కావడం వల్ల బ్యాంకు అధికారులు పొరబడి రుణం మంజూరు చేశామని తెలుసుకున్నారు. డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ సూచించగా వారు డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.