మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. ఏడడుగులు కలిసి నడిచారు.. తోడు, నీడగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. మాట ప్రకారమే ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంపై కాలం పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్తను జీవచ్ఛవంలా మార్చేసింది. తన కుటుంబానికి దిక్కెవరని కుమిలిపోతున్న వేళ.. భార్య అండగా నిలిచింది. కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. చంటి పిల్లాడికి తల్లిలా అన్నీ తానై చూసుకుంటోంది. నేనున్నానని భర్తకు ధైర్యం నూరిపోస్తోంది.
ఊహించని ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాకు చెందిన హన్మాండ్లు అనే వ్యక్తికి పదిహేడేళ్ల క్రితం కవితతో పెళ్లయింది. వారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లాడు. రియాద్ బల్దియాలో పనికి కుదిరాడు. దురదృష్టవశాత్తూ చెత్త డంపింగ్ చేస్తున్న హన్మాండ్లును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలై చాలా రోజులు కోమాలోనే ఉండిపోయాడు. ఒక మూత్రపిండం పూర్తిగా పాడవగా.. వెన్నుపూస, రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఆరు నెలలు సౌదీలోనే ఉన్న బాధితుడిని ఆ తర్వాత స్వగ్రామానికి పంపించారు. అప్పటి నుంచి అతన్ని మామూలు మనిషిని చేసేందుకు భార్య కవిత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఎకరం పొలం అమ్మేశారు. 7లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఐదేళ్లుగా మంచానికే పరిమితమై.. కనీసం లేవలేని దుస్థితిలో ఉన్నాడు...
బీడీలు చుడుతూ..
గ్రామంలోని నర్సరీలో పని చేయడంతోపాటు బీడీలు చుడుతూ కవిత కుటుంబాన్ని పోషిస్తోంది. ఫించను డబ్బులతో భర్తకు మందులు, ఇంటి అవసరాలు తీరుస్తోంది. హన్మాండ్లు వైద్యం కోసం ప్రతి నెలా రూ.6వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే ముగ్గురు కుమార్తెలను చదివిస్తోంది. పిల్లలతోపాటు భర్తకు సైతం బిడ్డగా సపర్యలు చేస్తోంది.