ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కాశ్మీర్ లాంటిదని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నిర్మల్, ముథోల్‌లోని 50వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్ కళకళలాడబోతుందన్నారు.
కొత్త రెవెన్యూ చట్టం..
గిరిజనులకు పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలన్నారు. జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయే కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తామన్నారు. ఒక్కొక్క గుంట లెక్కతేలేలా పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యలు పరిష్కరించడానికి తానే స్వయంగా ప్రతి జిల్లాకు వస్తానన్నారు. జిల్లాలో రెండు రోజులు ఉండి స్యయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. భూసమస్యల విషయంలో రైతులు ఎవరికీ లంచం ఇవ్వద్దని సూచించారు.
మతం పేరుతో మోదీ రాజకీయం
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా ప్రధాని నెరవేర్చారా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు పెట్టమని మోదీని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మతం పేరుతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కుల, మతాల పంచాయితీ పోతేనే దేశం బాగుపడుతుందన్నారు.
ప్రధాని వ్యక్తిగత విమర్శలు
ప్రధాని ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముక్కు పెద్దగా ఉంటదని ప్రధాని వ్యాఖ్యానించడంపై తీవ్రంగా మండిపడ్డారు. పనికొచ్చే అంశాలపై చర్చించే పార్టీలు లేవని... దేశ వ్యవసాయ, ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ భాజపా సిద్ధంగా ఉండవన్నారు.
కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే రానుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బాగుంటే సరిపోదు... దేశం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
నిర్మల్‌లో తెరాస ఎన్నికల ప్రచార సభ ఇవీ చూడండి: కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం