అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ysrtp president ys sharmila) వ్యాఖ్యానించారు. తెరాస ఏడేళ్ల పాలనలో గొప్పలు చెప్పుకోవడం మినహా చేసిందేమీ లేదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర (praja prasthanam) నిర్వహిస్తున్న ఆమె... ప్రజలతో ముచ్చటించారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో (praja prasthanam) భాగంగా షర్మిల... నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పలు పల్లెల్లో (ysrtp president ys sharmila padayatra) ప్రజల్ని కలుసుకున్నారు. కుర్మేడ్, సమాఖ్యనగర్, కుర్మపల్లి, సాయిరెడ్డిగూడెం, పి.కె.మల్లేపల్లిలో స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పి.కె.మల్లేపల్లిలో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేవరకు తమ పోరాటం ఆగదని... షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన తీరుపై మరోసారి ఆమె విమర్శలు చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి... ఆయా వర్గాల్ని మోసం చేశారన్నారు. పత్తి పంటకు సంబంధించి మోన్ శాంటో విషయంలో... వైఎస్ హయాంలో న్యాయపోరాటం వల్ల విత్తనాల ధరలు తగ్గి రైతులకు మేలు జరిగిందని షర్మిల గుర్తు చేసుకున్నారు.