యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. వందశాతం రాతి కట్టడాలతో, పూర్తిగా కృష్ణశిలలతో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. కొండపై విశాలంగా మాడవీధులు, ప్రాకారాలు, గోపురాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ప్రధానాలయం పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ప్రసాదం కాంప్లెక్స్ కూడా సిద్ధమైంది. శివాలయం పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇటీవల యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆలయ పనులకు సంబంధించి తుదిమెరుగులు దిద్దేలా అవసరమైన సూచనలు చేశారు. ఇత్తడితో క్యూలైన్లు, రెయిలింగ్, ప్రహరీగోడలకు సంబంధించి చేయాల్సిన పనులపై దిశానిర్ధేశం చేశారు. ఆ పనులన్నీ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అవన్నీ పూర్తవుతాయని అంటున్నారు.
వేగంగా విద్ద్యుదీకరణ పనులు..
కొండపై అభివృద్ధి చేసిన విష్ణు పుష్కరిణిని కొద్దిగా విస్తరిస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడ పనులు కూడా పూర్తి కానున్నాయి. గుట్టపై బస్సులు వచ్చి పోయేందుకు వీలుగా అభివృద్ధి చేస్తున్న బస్టాండ్ పనులు కొనసాగుతున్నాయి. కొండపై విద్యుత్ దీపాల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. పూర్తిగా వెలుగులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణాల చుట్టూ, పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం గతంలోనే పరిశీలించారు. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి.