నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక(local body mlc elections in nalgonda)ల్లో ఏకగ్రీవానికి శతథా యత్నించి.. సాధ్యం కాకపోవడంతో తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని తెరాస వ్యూహాలు(trs strategy in mlc elections) రచిస్తోంది. తమ ఓటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెరాస.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వానికి తావివ్వరాదని భావిస్తోంది. ఉన్న బలాన్ని కాపాడుకుంటూనే.. విపక్ష సభ్యుల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఒకవేళ అనుకున్నట్లుగా ఈ సమావేశం జరిగి ఉంటే.. మరో రెండ్రోజుల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేచేదే. ఉమ్మడి జిల్లాలో జరిగిన హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రీతిలో ఈ పోరులోనూ విజయఢంకా మోగించాలని తెరాస చూస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో భేటీ...
స్వతంత్రులుగా బరిలో నిలిచిన విపక్ష అభ్యర్థుల్లో ఒకర్ని తప్పించడానికి వీలులేని పరిస్థితుల్లో ఇక తమ బలగాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లతో సమన్వయ సమావేశం నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ నెల 27న నిర్వహించాల్సి ఉన్నా.. కొందరు నేతల గైర్హాజరు వల్ల ఈ భేటీని ఒకట్రెండు రోజుల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ ఆధారంగా చేపట్టే తర్వాతి సమావేశాలు ఉమ్మడి జిల్లా పరంగా ఉంటాయా..? లేక కొత్త జిల్లాల లెక్కన ఉంటాయా..? అన్నది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గం వారీగా భేటీలు నిర్వహిస్తే ఓటర్లందరికీ చేరువయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వినపడుతోంది.
కార్యాచరణపై దృష్టి...