నల్గొండ జిల్లాలో ధాన్యం విక్రయాలు.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు (grains collection in Nalgonda) కేంద్ర బిందువుగా మారుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న ట్రాక్టర్లతో మిల్లులు వాటి సమీపంలోని రహదారుల వద్ద ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. రోజుకు మూణ్నాలుగు వేల వాహనాలు కొనే అవకాశం ఉంటే... 15 నుంచి 20 వేల ట్రాక్టర్లు వస్తుంటాయి. దీంతో రైతులు అక్కడే.. నాలుగైదు రోజుల పాటు వేచి ఉండాల్సిన అగత్యం ఏర్పడుతోంది. దీన్ని నివారించేందుకు అధికార యంత్రాంగం.. 2020 నవంబరు నుంచి టోకెన్ల విధానాన్ని (Token system for grain purchase) అమలు చేస్తోంది. ఇప్పుడు అదే పద్ధతిని తిరిగి అమలుచేయాలని భావిస్తోంది.
కొద్దిరోజుల్లోనే వివాదం..
రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు, మార్కెటింగ్, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల విభాగాల అధికారుల సమన్వయంతో.. గత యాసంగిలో టోకెన్ల పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎడాపెడా పంట కోతలు చేపట్టకుండా... టోకెన్లు అందుకున్న రైతులే సరకు తెచ్చేలా... ఈ విధానాన్ని రూపొందించారు. కానీ కొద్దిరోజుల్లోనే ఇది వివాదంగా మారింది. ఒక్కో రైతు ఒకేసారి ఐదారు వాహనాలు తీసుకురావడం వల్ల... తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులు ఇబ్బందులు పడ్డారు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చునే దీనస్థితి ఏర్పడింది. తహసీల్దారు కార్యాలయాల వద్ద రోజంతా పడిగాపులు పడ్డ దయనీయ సంఘటనలు.. మిర్యాలగూడ, వేములపల్లిలో చోటుచేసుకున్నాయి. ఈసారి అమలుకాబోయే విధానం ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పంట విరామ నిబంధనతో... శుక్ర, ఆదివారాల్లో ధాన్యం తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడీ టోకెన్లు వస్తే మళ్లీ కష్టాలు మొదలైనట్లేనని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర కంటే తక్కువకే..