తెలంగాణ

telangana

ETV Bharat / city

DGP Mahender Reddy : పోలీసు శాఖలో పక్షపాత వైఖరికి తావులేదు

పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా అందరితో సమానంగా ఉండాలని.. సాయం కోరి వచ్చిన వారికి న్యాయం చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

డీజీపీ మహేందర్ రెడ్డి
డీజీపీ మహేందర్ రెడ్డి

By

Published : Aug 9, 2021, 2:27 PM IST

డీజీపీ మహేందర్ రెడ్డి

నేరం జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కన్నా ఘటనలు జరగకుండా చూడటమే గొప్పదనమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సమాజంలో భద్రతా భావం కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి నల్గొండలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా అందరితో సమానంగా ఉండాలని సూచించారు. థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా అభిప్రాయాలు తీసుకుని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

" రాష్ట్రంలో చాలా వరకు కేసులను సాంకేతికత ఆధారంగానే పరిష్కరించాం. నేరాల నియంత్రణలో.. నేరస్థులను గుర్తించడంలో టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా.. చిన్నచిన్న కాలనీల నుంచి గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాలు, నగరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నేరస్థులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది. దాదాపు 9 లక్షల కెమెరాలున్నాయి. "

- మహేందర్ రెడ్డి, డీజీపీ

నల్గొండలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రంతో పిల్లలు, మహిళలకు ఎంతగానో లాభం చేకూరుతుందని డీజీపీ అన్నారు. ఇది వారి భద్రత కోసమే కాకుండా.. వారిలో నైపుణ్యం పెంపొందించి.. ఆసరాగా నిలవడానికి తోడ్పడుతుందని తెలిపారు. భరోసా కేంద్రాల ద్వారా ప్రజల్లో భద్రతాభావం కలుగుతోందని చెప్పారు. ప్రజలు భద్రంగా ఉంటే... రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని అన్నారు. పెట్టుబడులతో రాష్ట్ర ప్రగతి పథంలో దూసుకెళ్తుందని.. తద్వారా ప్రజలు పేదరికం నుంచి బయటపడతారని డీజీపీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details