తెలంగాణ

telangana

ETV Bharat / city

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట జవాను మృతి
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట జవాను మృతి

By

Published : Jun 16, 2020, 5:12 PM IST

Updated : Jun 16, 2020, 8:24 PM IST

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

17:11 June 16

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ అమరుడయ్యారు.  బిహార్ 16 బెటాలియన్ కల్నల్​గా విధులు నిర్వర్తిస్తున్నసంతోష్​ మృతిపై అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడం వల్ల కల్నల్‌ సంతోష్​తోపాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్‌ మరణవార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో... సంతోష్​ ఎక్కువ భాగం కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్​లో సేవలందించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించిన వీర జవాను... కొద్దికాలం పాటు కాంగో దేశంలోనూ సైనిక్ విధుల్లో పాలుపంచుకున్నారు. చిన్నప్పట్నుంచి అన్ని స్థాయిల్లోనూ అద్భుత ప్రతిభ కనబరచి... బంగారు పతకాలు సొంతం చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చదువులో చురుకైన సంతోష్... 37 ఏళ్ల వయసులోనే కల్నల్​గా పదోన్నతి పొంది రికార్డు సృష్టించారు. 

నెల రోజుల్లో హైదరాబాద్‌కు వస్తానని చెప్పాడు, సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందని చెప్పాడు, సైన్యంలో పనిచేయాలని నా చిన్నప్పటి కోరిక, కొన్ని కారణాల వల్ల నేను సైన్యంలో చేరలేకపోయాను. నా కుమారుడైనా సైన్యంలో సేవలందించాలని అనుకున్నాను. కుప్వారా జిల్లాలో కూడా సమర్థంగా విధులు నిర్వర్తించాడు. ఎక్కడ పనిచేసినా...మంచి పనితీరుతో అధికారుల ప్రశంసలు అందుకున్నాడు. చాలా చిన్న వయసులోనే కల్నల్‌ స్థాయికి ఎదిగాడు. పోస్టింగ్‌ నాటి నుంచి బిహార్‌-16 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. డిపార్ట్‌మెంట్‌ విషయాలు ఎప్పుడూ కుటుంబంతో చెప్పేవారు కాదు. . - కల్నల్​ సంతోష్​ తండ్రి.

విధుల్లో ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని మాకు చెప్పేవాడు. తల్లిగా బాధగా ఉంది... దేశ పౌరురాలిగా గర్వంగా ఉంది. సైన్యంలో పనిచేసేవారు ధన్యజీవులు. సంతానం ఒక్కరున్నా...ఎంతమంది ఉన్నా సైన్యంలో చేర్చవచ్చు - కల్నల్​ సంతోష్​ తల్లి. 

ప్రముఖుల నివాళి..

కల్నల్ సంతోష్‌బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోష్ కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని ప్రశంసించారు. కల్నల్‌ సంతోష్‌ త్యాగం వెలకట్టలేనిదన్నారు. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

కల్నల్‌ సంతోష్‌బాబుకు గవర్నర్‌ తమిళిసై శ్రద్ధాంజలి తెలిపారు. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పరాక్రమవంతుడైన సైనికాధికారి దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి ఫోన్‌లో కల్నల్​ తల్లిదండ్రులను పరామర్శించారు. 

ఇవీ చూడండి: లద్దాక్ ఘర్షణలో అమరుడైన తమిళనాడు వాసి


 

Last Updated : Jun 16, 2020, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details