తెలంగాణ

telangana

ETV Bharat / city

మునుగోడులో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు - మునుగోడు ఉపఎన్నిక తాజా సమాచారం

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక సమరానికి సిద్ధమైన ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికల్లో పోల్‌ నిర్వహణే కీలంగా భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మకాం వేసి పోలింగ్‌ శాతం పెంచుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన అభ్యర్థులు మద్దతుదారులను పోలింగ్‌ కేంద్రానికి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Munugode Bypoll
Munugode Bypoll

By

Published : Oct 8, 2022, 1:30 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలన్ని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏ చిన్న అవకాశం విడిచిపెట్టకుండా తమదైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం మెుదలుపెట్టిన తెరాస, భాజపా, కాంగ్రెస్‌... పోలింగ్‌ నిర్వహణపై దృష్టిసారించాయి. ఓటర్లు మద్దతు ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకులు, సానుభూతిపరులను అప్రమత్తం చేస్తున్నాయి. మద్దతుదారులైన... ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేట్లు చూసుకోవడం కీలకం కానుంది.

మునుగోడు నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల జనాభా ఉంది. ఇందులో 86శాతం గ్రామీణ, 14శాతం పట్టణ జనాభా ఉందని అంచనా వేస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 2 లక్షల 30 వేల 197 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో పురుషుల కంటే మహిళా ఓట్లు అయిదారువేలు తక్కువగా ఉన్నాయి. 2009 నుంచి 2018 వరకు ఏటికేడు పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 77.06 శాతం... 2014లో 82.01 ఓటింగ్‌ శాతం నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణపై రాజకీయ పార్టీలు మరింత దృష్టిసారించడంతో.. ఏకంగా 91.03శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు అన్ని పార్టీలు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునా పోలింగ్‌ నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

మునుగోడు నియోజకవర్గంలోని 7మండలాల పరిధిలో 298 పోలింగ్‌ బూత్‌లున్నాయి. చౌటుప్పల్‌లో 68, సంస్థాన్‌నారాయణపురం 54, మునుగోడు 44, చండూరు 40, మర్రిగూడ 33, నాంపల్లి 43, గట్టుప్పల్‌ 16 చొప్పున ఉన్నాయి. కులాల వారీగా బీసీలు దాదాపు 60శాతం ఉండగా, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 20 నుంచి 25శాతం, మిగిలిన వారు 15 నుంచి 20 శాతం ఉంటారని అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులైన ఓటర్లను అప్రమత్తం చేసి... పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేట్లు చూసినప్పుడే పోలింగ్‌ 90శాతం దాటే అవకాశం ఉంది.

2018లో జరిగిన ఎన్నికల్లో 91శాతం పోలింగ్‌ నమోదు కావటంతో... ఉపఎన్నికలోనూ 95శాతం వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రతిఓటు కీలకం కావడంతో బయట ప్రాంతాల్లో ఉంటున్నవారిని రప్పించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details