శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు ఇన్‌లెట్‌లో నీళ్లు నిలిచి ఉండటంతో టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. కొన్నేళ్ల నుంచి కరెంటు బిల్లులు కట్టకపోవడంతో ఎస్‌పీడీసీఎల్ ఈ ప్రాజెక్టుకు సరఫరా నిలిపేసింది. దీంతో ఇన్‌లెట్‌లో నిలిచిన నీటిని అధికారులు తొలగించడం లేదు.
ఎస్‌ఎల్‌బీసీ ఇన్లెట్కు ముప్పు.. టీబీఎం దెబ్బతినే ప్రమాదం - Srisailam left bank canal in nalgonda district
కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం వల్ల శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టుకు ఎస్‌పీడీసీఎల్.. కరెంట్ సరఫరా నిలిపివేసింది. దీనివల్ల ఇన్‌లెట్‌లో నీళ్లు నిలిచినా.. అధికారులు తొలగించడం లేదు. ఫలితంగా టన్నెల్ బోరింగ్ మెషీన్ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
భారీగా నిలిచిన నీళ్లలో టన్నెల్ బోరింగ్ మెషీన్ మునిగితే సొరంగాన్ని తొలవడానికి వీల్లేకుండా అవుతుందని... టన్నెల్ నుంచి ఆ యంత్రాన్ని బయటకు తీయడానికి అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్లనే బిల్లులు కట్టలేకపోతున్నామని గుత్తేదారు కంపెనీ ఎస్‌పీడీసీఎల్‌కు పలుమార్లు లేఖ రాసింది. అయినా ఫలితం లేకపోయింది. 2018 మేలో ఆగిపోయిన పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని దోమలపెంటలో ఇన్‌లెట్ ఉండగా..అక్కడి నుంచి 43.9 కి.మీ. దూరంలో నాగర్‌కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద ఔట్‌లెట్ ఉంది. ఇప్పటికి 33.3 కి.మీ. దూరం టన్నెల్ మార్గం పూర్తి చేశారు. మరో 10 కి.మీ. మేర పనులు జరగాల్సి ఉంది. మన్నెవారిపల్లి వద్ద బుధవారం సిబ్బంది టీబీఎం టెస్టింగ్ పనులను నిర్వహించారు. ఇటీవల విద్యుత్తు పునరుద్ధరణ కోసం గుత్తేదారు కంపెనీ విద్యుత్తు పంపిణీ అధికారులకు రాసిన లేఖ నేపథ్యంలో త్వరలో పనులు మొదలుకానున్నట్లు తెలిసింది. పనులు నిలిచి దాదాపు మూడేళ్లు కావొస్తున్న దృష్ట్యా... టీబీఎం పరిస్థితిని అధికారులు, సిబ్బంది పరీక్ష చేసి చూశారు.