గుజరాత్ హోంమంత్రి హరేన్‌పాండ్య హత్యకేసులో నిందితులకు సుప్రీంకోర్టు శుక్రవారం శిక్ష విధించింది. దీంతో నల్గొండకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అస్గర్‌అలీ, హైదరాబాద్‌కు చెందిన రవూఫ్ పేర్లు మరోసారి తెరపైకొచ్చాయి. యుక్త వయసులోనే ఉగ్ర బాట పట్టిన అస్గర్ అలీ... ఆధారాల్లేవన్న కారణంతో 2011 ఆగస్టులో గుజరాత్ హైకోర్టు హరేన్ పాండ్య కేసు కొట్టివేసింది. వెంటనే అస్గర్ నల్గొండకు చేరుకున్నాడు. గతేడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుతో మరోసారి ఆయన పేరు మారుమోగింది.
ఉగ్రవాదం వైపు అడుగులు...
గుజరాత్‌కు చెందిన రసూల్‌ఖాన్ అనే చమురుదొంగ అక్కడ పోలీసుల ఒత్తిడితో 1994లో హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. బాబ్రీమసీదు విధ్వంసం తాలూకూ ఉద్రిక్తతలు అప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద భావజాలంతో ఊగిపోతున్న వారిని ఆసరాగా తీసుకుని రసూల్ వారిలో ఉగ్రవాద భావాలు నూరిపోశాడు. వారిలో అస్గర్‌అలీ, రవూఫ్ ఉన్నారు.
పట్టుబడినా... బయటకొచ్చాడు...
ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టిన అస్గర్ అలీ కొన్నాళ్లకు పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి 1996లో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి ఇక్కడ కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. 2002 సంవత్సరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగడం వల్ల ఆ రాష్ట్ర హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్యచేయాలని రసూల్ కుట్రపన్నాడు. కాల్పులు జరపడంలో సుశిక్షితుడైన అస్గర్ అలీకి ఆ బాధ్యత అప్పగించారు. ఉదయపు నడకకు వచ్చిన హరేన్‌పాండ్యను అతి సమీపం నుంచి కాల్చి చంపేసి అస్గర్ హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. ఈ కేసులో అస్గర్‌కు సహకరించిన రవూఫ్, అబ్దుల్‌బారీ, ఇఫ్తికార్‌లను 2003లో సీబీఐ అరెస్టు చేసింది. 2011లో గుజరాత్ హైకోర్టు ఆ కేసు కొట్టివేయడం వల్ల అస్గర్‌అలీ నల్గొండ చేరుకొని సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టాడు.
ఎట్టకేలకు...
గతేడాది సెప్టెంబరులో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌హత్య సందర్భంలో అస్గర్ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో మారుతీరావు అనే వ్యాపారి ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌ను హతమార్చిన సుభాష్‌శర్మను మారుతీరావుకు పరిచయం చేసింది అస్గర్‌అలీ, అబ్దుల్‌బారీలే. ఆ నేరంపై వారిద్దరూ ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నారు. తాజాగా హరేన్‌పాండ్య కేసులో సుప్రీంకోర్టు అస్గర్‌అలీతోపాటు అతని సహచరుడైన రవూఫ్‌కు జీవిత ఖైదు విధించింది.
ప్రణయ్ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు - miryalaguda
అస్గర్‌అలీ... ఉగ్రవాద కార్యకలాపాల్లో ఆరితేరిన క్రూరుడు. పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారీ, తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందిన వ్యక్తి. గుజరాత్ హోంమంత్రిని హత్య చేసిన దోషి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్ కేసులో నిందితుడు. మళ్లీ తెరపైకి వచ్చాడు. గుజరాత్ హోంమంత్రి హరేన్‌పాండ్య హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది.
ప్రణయ్ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
ఇవీ చూడండి: ధర్మాసనానికి క్షమాపణ చెప్పిన గద్వాల కలెక్టర్