నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల విమర్శలు -ప్రతివిమర్శలు, సవాళ్లు - ప్రతిసవాళ్లతో మునుగోడు ఉపఎన్నిక పోరు వేడెక్కుతోంది. నామినేషన్ల వేళ భారీ ర్యాలీలు... ఊరూర విస్తృత ప్రచారాలు, చేరికలు, ప్రజాకర్షక ప్రసంగాలతో నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలో... పైచేయి సాధించేందుకు తమదైన వ్యూహాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు.
పార్టీలన్ని ప్రచారంలో తలమునకలై ఉండగా.. తాజాగా గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా... ఈ గోడపత్రికలు వెలిశాయి. నియోజకవర్గపరిధిలోని చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన కూడలి, హోటళ్లు, మద్యం దుకాణాల వద్ద గోడపత్రికలు అతికించారు. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తరహాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుబోయారంటూ... పోస్టర్లలో ముద్రించారు. గమనించిన పోలీసులు వాటిని తెల్లవారుజామున తొలిగించారు.