నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పక్కన హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలినగర్‌లో.. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అనే అర్ధం వచ్చేలా తెరాస సోషల్ మీడియా విభాగం లక్ష చదరపు అడుగుల్లో.. కేసీఆర్ చిత్రపటానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గ పరిధిలోని 60వేల ఎకరాల్లో సాగు నీరు ఇస్తూ.. నెల్లికల్ లిఫ్ట్ ద్వారా మరొక 30వేల ఎకరాల్లో సాగు నీరు ఇవ్వనున్న సందర్భంగా చిత్రం గీశారు.
గడపగడపకు తెరాస..
పెద్దవూర మండలం తెప్పలమడుగు, లింగంపల్లిలో మంత్రి తలసాని, అభ్యర్థి భగత్, బాల్క సుమన్.. ఓటర్లను కలుసుకున్నారు. అదే మండలం సంగారంలో మంత్రి జగదీశ్ రెడ్డి.. అభ్యర్థి భగత్‌తో కలిసి ప్రచారం చేశారు. మాడుగులపల్లి మండలం కన్నెకల్‌లో గడపగడపకు వెళ్లి.. శాసనసభ్యులు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యే సురేందర్.. తిరుమలగిరి మండలం తునికినూతలలో ఓటర్లతో ముచ్చటించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, వికలాంగుల పింఛన్లను కేసీఆర్ మాత్రమే అందిస్తున్నారని తలసాని గుర్తు చేశారు.
ప్రసన్నం చేసుకునే పనిలో హస్తం..
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, సీనియర్ నేత దామోదర్ రెడ్డి.. నిడమనూరు మండలం శాఖాపురం, రాజన్నగూడెం, పార్వతీపురం, వెంగన్నగూడెం, ముకుందాపురంలో పర్యటించారు. హాలియాలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. తాను చేసిన అభివృద్ధితోనే ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి తమ వద్దకు వలస వచ్చారని... జానారెడ్డి ప్రజలకు వివరించారు.