తెలంగాణ

telangana

ETV Bharat / city

'సాగర్​' సమరం.. పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం - సాగర్​లో వేడెక్కుతున్న రాజకీయాలు

నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో... రాజకీయ కాక మొదలైంది. అభ్యర్థిత్వాలపై ఊహాగానాలు చెలరేగుతున్నా... కిందిస్థాయి కేడర్​పైనే ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ప్రజల్ని కలుసుకునేందుకు... శుభకార్యాలు, పరామర్శల పేరుతో గ్రామాల్లో వాలుతున్నారు.

political heat in nagarjunasagar and all parties leaders tours in villages
వేడెక్కుతున్న 'సాగర్​' సమరం.. పల్లెల్లో నేతల పర్యటనలు

By

Published : Dec 26, 2020, 2:07 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గంలో... అన్ని పార్టీలు సందడి చేస్తున్నాయి. నోముల నర్సింహయ్య మృతితో... ఇక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇంతకాలం హైదరాబాద్​కే పరిమితమైన నాయకులంతా... కిందిస్థాయి కార్యకర్తల్ని కలుసుకునే ప్రయత్నంలో తలమునకలయ్యారు. ఎక్కడ శుభకార్యం జరిగినా, ఎవరినైనా పరామర్శించాలన్నా అదే మంచి అవకాశంగా భావించి... వెంటనే అక్కడ వాలిపోతున్నారు. దీంతో సాగర్ సెగ్మెంట్​లోని అన్ని పల్లెల్లోనూ... సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాతోపాటు చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల కోణంలోనే గ్రామాలు చుట్టివస్తున్నారు.

ఎప్పుడొచ్చినా సిద్ధం..!

ఈ నెల 1న నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందినప్పటి నుంచి... సాగర్ రాజకీయాలపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్న ఉద్దేశంతో ఎవరికి వారే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. నోముల సంతాప సభ నిర్వహించే వరకు స్తబ్ధుగా ఉన్న అధికార పార్టీ... ఇపుడు ప్రజల్ని కలుసుకునే పనిలో పడింది. పురపాలక సంఘం సమీక్షకు హాజరయ్యేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి... ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటన చేపడుతున్నారు. ఇక జానారెడ్డితోపాటు ఆయన తనయుడు... తమ కేడర్​పై దృష్టిపెట్టారు. వీలైనప్పుడల్లా ముఖ్య నాయకులని వ్యక్తిగతంగా కలుస్తున్న జానా... గత ఎన్నికల్లో చేజారిన శ్రేణులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బరిలో తెదేపా

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్​ఎంసీ ఫలితాల ఉత్సాహంతో భాజపా ... సాగర్​లోనూ అవే తరహా వ్యూహాలు రచిస్తోంది. పార్టీ నేతలు ప్రజల్ని కలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు అభ్యర్థిత్వం ఆశిస్తుండగా... మరికొంత మంది స్థానికేతరులు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్​.. స్థానికులకా? కొత్తవారికా? అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. తెదేపా నుంచి బరిలో నిలిచేందుకు ఇద్దరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇవీ చూడండి:నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భాజపా బైక్​ ర్యాలీ

'ఓట్లు అడిగే హక్కు ఒక్క తేదేపాకే ఉంది'

ABOUT THE AUTHOR

...view details