తెలంగాణ

telangana

ETV Bharat / city

సాగర్​పోరు: కిలో మటన్‌.. మద్యం బాటిల్‌ - తెలంగాణ రాజకీయ వార్తలు

ఈ ఏడాది ఉగాది పండగ ఒక్క పైసా ఖర్చు లేకుండా జరిగిందని నాగార్జునసాగర్​ నియోజకవర్గ పరిధిలోని కన్నెకల్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పారు. అంతే అక్కడ ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉపఎన్నిక ప్రచార పర్వానికి గురువారంతో తెరపడనుండడం వల్ల ఓట్లను ఆకర్షించే పనిలో పూర్తిగా నిమగ్నమైన పార్టీలు అందుకు ఉగాదిని ఉపయోగించుకున్నాయి. పలు గ్రామాల్లో ఓ ప్రధాన పార్టీ ఉదయం.. కిలో మటన్‌, మద్యం సీసాను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇది తెలిసి మరో రాజకీయ పార్టీ నాయకులు కిలో చికెన్‌ను పంపిణీ చేశారు.

nagarjunasagar campaign
నాగార్జున సాగర్​ ఉపఎన్నిక ప్రచారం

By

Published : Apr 14, 2021, 8:26 AM IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారానికి గురువారం తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు కాక పెంచాయి. ప్రచారాన్ని పతాక స్థాయిలో నిర్వహిస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని తెరాస, ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాలని కాంగ్రెస్‌ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అనూహ్య ఫలితం సాధించాలనే తపనతో భాజపా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే పనుల్లో వేగం పెంచాయి.

పోలింగ్‌కు మరో నాలుగు రోజులుండగానే పలు మండలాల్లో రెండు ప్రధాన పార్టీలు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నాయి. మాడుగులపల్లి మండలం గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్‌, గారుకుంటపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం ఉగాది సందర్భంగా ఓ ప్రధాన పార్టీ ఉదయం కిలో మటన్‌, మద్యం సీసాను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇది తెలిసి మరో రాజకీయ పార్టీ నాయకులు కిలో చికెన్‌ను పంపిణీ చేశారు. నిడమనూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీ పండగ ఖర్చులకు కుటుంబానికి రూ.500 ఇచ్చింది. ‘‘ఉప ఎన్నిక పుణ్యమా అని నెల రోజుల నుంచి తాగేవాళ్లకు మద్యానికి కొదవలేదు. ఈ ఏడాది ఉగాది పండగ ఒక్క పైసా ఖర్చు లేకుండా జరిగింద’ని కన్నెకల్‌కు చెందిన యాదగిరి చెప్పారు.

ఎడమ కాల్వ ఆయకట్టు పరిస్థితిని పోల్చుతూ...

అధికార తెరాస ప్రధానంగా ఇంటింటి ప్రచారాన్ని నమ్ముకుంది. ఇక్కడ నోముల భగత్‌ బరిలో నిలిచారు. మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జులు ఉదయం, సాయంత్రం వారికి కేటాయించిన గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టును ఇప్పటి పరిస్థితితో పోల్చుతూ ఓట్లు అడుగుతున్నారు. 10 గ్రామాలకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ఆ ఓట్లు తెరాసకు పడేలా పావులు కదుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ప్రచారంలో పాల్గొంటున్నారు. అర్ధరాత్రి వరకు గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ద్వారా కింది స్థాయిలో ఏం జరుగుతోందనే విషయాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలో కీలకంగా తిరుగుతున్న వారిని గుర్తించి పార్టీలో చేరేవిధంగా రెండో శ్రేణి నేతలతో సమన్వయం చేస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేయని హామీలను గుర్తుచేస్తూ...

మండలాల వారీగా రెండు నెలల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా రాష్ట్ర పార్టీ అగ్ర నేతలంతా రంగంలోకి దిగారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన మండలాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నలభై ఏళ్లలో జానారెడ్డి ఇక్కడ చేసిన అభివృద్ధిని వారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయన తనయులు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి పార్టీ అగ్రనేతల ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలకు రానున్న రెండు మూడు రోజుల్లో వ్యవహరించాల్సిన దానిపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కల్ని వివరిస్తూ...

ఇప్పటివరకు తెరాస, కాంగ్రెస్‌లకు అవకాశం ఇచ్చారని, ఈ దఫా ఒక్కసారి తమ పార్టీకి అవకాశమిస్తే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని భాజపా నేతలు ప్రచారం చేస్తున్నారు. భారీ సభలు కాకుండా గ్రామాల వారీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాలకు ఎన్ని నిధులు వచ్చాయనే దానిపై లెక్కలు వేసి వివరిస్తున్నారు. ప్రధానంగా అభ్యర్థి రవికుమార్‌ సామాజికవర్గ ఓట్లపై పార్టీ పూర్తి నమ్మకం పెట్టుకొంది. గతంలో అండగా ఉండి ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నవారి గురించి ఆరా తీస్తోంది. వారిని తిరిగి పార్టీలోకి చేర్పించే విధంగా ప్రచారానికి వచ్చిన నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓటు బ్యాంకును పెంచుకోవడం, సంస్థాగతంగా బలపడటంపై పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది.

ఇవీచూడండి:ఇవాళ, రేపే సాగర్​ ఉపఎన్నిక ప్రచారానికి గడువు

ABOUT THE AUTHOR

...view details