తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​: ఉమ్మడి నల్కొండ పోలీసుల పక్కా వ్యూహం - యాదాద్రి జిల్లాలో కరోనా ప్రభావం

లాక్​డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాలు, చెక్​పోస్టుల వద్ద పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇతర వాహనాల్ని అనుమతించడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండం వల్ల రోడ్డెక్కడానికే ప్రజలు భయపడుతున్నారు. ప్రధాన పట్టణాల్లోనూ రద్దీని నియంత్రించేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుచేశారు.

nalgonda police strong action on lock down emergency vehicles only allowed
లాక్​డౌన్​: ఉమ్మడి నల్కొండ పోలీసుల పక్కా వ్యూహం

By

Published : Mar 26, 2020, 11:16 AM IST

కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో ప్రజలు గుమిగూడే ప్రాంతాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు దృష్టిపెట్టారు. టోల్​ ప్లాజాలు, చెక్​పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాహనాలను నిలిపివేస్తున్నారు.

మార్కెట్లు..

సామాజిక దూరం పాటించేందుకు వీలుగా.. ఎక్కువ మంది ఒకేచోట ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయల మార్కెట్లోనే జనం ఎక్కువగా ఉంటున్నారని భావించిన పోలీసులు.. మార్కెట్లన్నీ ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

ఇంటికే ఔషధాలు..

మిర్యాలగూడలో ఔషధాల కోసం మందుల దుకాణాలకు వచ్చేవారిని నిలువరించి.. వారి ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని నిర్ణయించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు మందుల దుకాణాలకు సంబంధించిన మొబైల్ నంబర్లు ప్రకటించారు. ఆయా దుకాణాల నుంచి నేరుగా ఇళ్లకు చేరుకునేలా హోం డెలివరీని అందుబాటులోకి తెస్తున్నారు. మందులు అవసరమైన వారు దుకాణాల వారికి వాట్సాప్ ద్వారా వివరాలు పంపితే.. ఇంటికి పంపించే ఏర్పాట్లు సాగుతున్నాయి.

యాదాద్రి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంతంగితోపాటు నల్గొండ కేతేపల్లి మండలం కొర్లపాడు, మాడ్గులపల్లి టోల్​గేట్ల వద్ద వాహనాల రాకపోకల్ని నియంత్రించారు. క్లాక్ టవర్, కలెక్టరేట్, పాన్​గల్ బైపాస్, హైదరాబాద్ రహదారిలోని మర్రిగూడ బైపాస్ వద్ద బారికేడ్లు ఉంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించి రాకపోకలకు అనుమతినిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలతో బుధవారం సాయంత్రం నుంచి టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. పరిమిత సంఖ్యలోనే వాహనాలు వెళ్లడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రహదారుల్లో ఇబ్బందులు ఎదురుకాలేదు.

లాక్​డౌన్​: ఉమ్మడి నల్కొండ పోలీసుల పక్కా వ్యూహం

ఇవీచూడండి:'అక్కడే ఆపి ఉంటే... వచ్చే వాళ్లం కాదుగా'

ABOUT THE AUTHOR

...view details