‘మర్డర్’ సినిమా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు - rgv murder movie
14:20 August 24
‘మర్డర్’ సినిమా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(ఆర్జీవీ)కు నల్గొండ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నల్గొండలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం ఆధారంగా రాంగోపాల్‌వర్మ ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తమపై చిత్రీకరిస్తున్న సినిమాను నిలిపివేయాలంటూ ప్రణయ్ భార్య అమృత గత నెలలో కోర్టులో సివిల్ దావా వేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ‘మర్డర్’ సినిమాను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమా విషయమై గతంలోనే ఆర్జీవీ స్పందించారు. ‘మర్డర్’ సినిమాతో ఇతరుల్ని చెడుగా చూపించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కేసు కవర్ చేసిన ఓ పాత్రికేయుడి కోణంలో ఈ సినిమా ఉండొచ్చు! విచారణ చేసిన పోలీసు అధికారి ఆలోచనలకు సంబంధించింది కావొచ్చు.. వివిధ మాధ్యమాల ద్వారా దీని గురించి తెలుసుకున్న వ్యక్తి ఉద్దేశం అయినా కావొచ్చు. ఓ దర్శక, నిర్మాతగా నా ఆలోచనల ప్రకారం మర్డర్‌ను తెరకెక్కించే హక్కు నాకుంది. కొందరిని చెడుగా చూపించడానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవడం సరికాదు. ఎందుకంటే.. ఏ వ్యక్తి చెడు కాదని నేను గట్టిగా నమ్ముతా. కేవలం ప్రతికూల పరిస్థితులు వ్యక్తిని చెడ్డవాడిని చేస్తాయి. అలా ప్రవర్తించేందుకు కారణమౌతాయి. దీన్నే నేను ‘మర్డర్’లో చూపించాలి అనుకుంటున్నా. ఆ ప్రకటన రాసిన వారికి నేను చివరిగా ఒకటి చెబుతున్నా.. మనుషులపై, వారి ఫీలింగ్స్‌పై నాకు గౌరవం ఉంది. వారు పడ్డ బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ మర్డర్ తీయబోతున్నా’’ అని వర్మ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'ఎస్పీబీకి కరోనా నెగటివ్.. అవాస్తవమన్న చరణ్'