తెలంగాణ

telangana

ETV Bharat / city

అభ్యర్థుల విజయానికి అధినేతల పర్యటన - 2019 tg elections

పోరుగడ్డ నల్గొండలో కాంగ్రెస్ కీలక నేతలతో తలపడుతున్నారు అధికార పార్టీ అభ్యర్థులు. సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీల అగ్రనేతలు ఉమ్మడి జిల్లాపై ప్రచార దండయాత్ర చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు గులాబీ దళపతి నేడు వస్తుంటే...రాహుల్, అమిత్​ షా పర్యటనలకు కసరత్తు జరుగుతోంది.

మిర్యాలగూడలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

By

Published : Mar 29, 2019, 1:20 PM IST

Updated : Mar 29, 2019, 3:16 PM IST

మిర్యాలగూడలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం
పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార, విపక్షాలు తహతహలాడుతున్నాయి. నల్గొండ జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యనేతలే రంగంలోకి దిగుతున్నారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కు పోటీగా తెరాస కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. ఏ ఎన్నికైనా ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే గులాబీ బాస్... పార్టీ గెలుపు కోసం నడుంకట్టారు. రాజకీయాల్లో అడుగుపెడుతూనే...కాంగ్రెస్ పెద్ద తలకాయతో పోటీ పడుతున్న వ్యక్తికి శక్తినిచ్చేందుకు ముఖ్యమంత్రే స్వయంగా క్షేత్రంలోకి దిగుతున్నారు. అందులో భాగంగానే నేడు మిర్యాలగూడ ప్రచార సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

బలంగానే ఉన్నప్పటికీ...

నల్గొండ లోక్​సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా... నల్గొండ జిల్లాలో 4, సూర్యాపేట జిల్లాలో 3 ఉన్నాయి. హుజూర్​నగర్ మినహా, అన్ని స్థానాల్లో తెరాస ఎమ్మెల్యేలను గెలుచుకొని బలమైన శక్తిగా ఎదిగింది గులాబీ పార్టీ. అయిప్పటికీ...ఉత్తమ్, కోమటిరెడ్డిని ఎదుర్కోవాల్సి ఉన్నందున ఎన్నికలను చాలా సీరియస్​గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న తెరాస... కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. విజయం సొంతం చేసుకోవాలంటే నేతల్లో ఐక్యత తీసుకురావాలన్న భావన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రమే సీనియర్ నేతలుగా ఉన్నారు. వీరికి తోడుగా మరికొంతమందిని రంగంలోకి దించే యోచనలో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది.

తెరాసకు గట్టి సవాల్​...

రాజకీయాల్లోకి వస్తూనే అధికార పార్టీ టికెట్ దక్కించుకోవడం ఒకెత్తైతే... ఏకంగా పీసీసీ అధ్యక్షుణ్నే ఎదుర్కోవడం పెద్ద సవాల్. తెరాస ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలిచినప్పటికీ... అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​కు పట్టుంది. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వర్గాలు పార్టీ గెలుపు కోసం కృషి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కోమటిరెడ్డికి పెద్ద ఎత్తున అనుచరవర్గం, బంధుగణం ఉన్నందున... ఉత్తమ్​ నామినేషన్ వేసినప్పటి నుంచే, కోమటిరెడ్డితో సయోధ్య నెరిపే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరిలోనూ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉత్తమ్ సమీక్షిస్తున్నారు.

ఇద్దరు హేమాహేమీలను ఢీ కొట్టాల్సిన పరిస్థితుల్లో అధికార పార్టీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాయంత్రం జరిగే అధినేత సభకు ఏర్పాట్లు పూర్తి చేసి...బలం నిరూపించుకునేందుకు ఎవరికి వారు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. రెండు స్థానాల్లోనూ 2లక్షలకుపైగా ఆధిక్యాన్ని తీసుకొస్తామని కేటీఆర్​కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన తెరాస నేతల్లో కనబడుతోంది.

ఇవీ చూడండి:ఒకరికి ఒకరు తోడుగా...ప్రచారంలో అండగా

Last Updated : Mar 29, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details