తెలంగాణ

telangana

ETV Bharat / city

ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరిరోజు అట్టహాసంగా పాల్వాయి స్రవంతి నామినేషన్ - నామినేషన్ వేసిన స్రవంతి

Palvai Sravanthi Nomination: మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీగా వెళ్లి చండూరులో నామినేషన్ దాఖలు చేశారు. స్రవంతి వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి, భట్టి విక్రమార్క, పలువులు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను తుంగలో తొక్కేందుకు రాజగోపాల్‌ రెడ్డి యత్నిస్తున్నారని స్రవంతి ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని ఆమె మండిపడ్డారు.

Palvai Sravanthi Nomination
Palvai Sravanthi Nomination

By

Published : Oct 14, 2022, 5:01 PM IST

Updated : Oct 14, 2022, 5:17 PM IST

Palvai Sravanthi Nomination: మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి భారీ ర్యాలీలతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి రోజైన నేడు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బంగారు గడ్డ నుంచి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో తరలివచ్చి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో స్రవంతి వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా మునుగోడు ప్రాంతం కనీస అభివృద్ధికి నోచుకోలేదని పాల్వాయి స్రవంతి అన్నారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను తుంగలో తొక్కేందుకు రాజగోపాల్‌ రెడ్డి యత్నిస్తున్నారని స్రవంతి ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఫిరాయించారని దుయ్యబట్టారు. తన తండ్రి ఆశయాల సాధనకు తన జీవితకాలం పని చేస్తానని పేర్కొన్నారు. మునుగోడు ఆడబిడ్డగా తనను ఆశీర్వదించాలని స్రవంతి కోరారు.

గుర్రంపై వెళ్లి నామినేషన్​.. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఇవాళ స్రవంతితో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నాంపల్లి మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి విరబోగ వసంత రాయలు అనే వ్యక్తి వినూత్న రీతిలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చాడు. చండూరులోని ఒగ్గు కళాకారులతో బోనాలతో గుర్రంపై ఎక్కి బస్టాండ్ నుంచి ఎన్నికల కార్యాలయం వరకు వెళ్లాడు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించాడు. నిన్నటి వరకు 56 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 24 మంది నామినేషన్లు వేయగా.. 35 సెట్లు అందినట్లు అధికారులు వెల్లడించారు.

పోలింగ్‌ గడువు మరో పక్షం రోజులే.. మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. విపక్షాలు సైతం అదే స్థాయిలో హడావిడి చేస్తున్నాయి. గల్లీగల్లీన కార్యకర్తలు గస్తీ కాస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కీలక ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మునుగోడులో కేంద్రీకృతమైంది. పోలింగ్‌ గడువు మరో పక్షం రోజులే ఉండటంతో జోరుగా ప్రచారాలతో హోరెత్తించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details