తెలంగాణ

telangana

ETV Bharat / city

Munugode Bypoll: ముఖ్య నేతల మును'గోడు'... రాజకీయ భవిష్యత్తుపై బెంగ! - నల్గొండ తాజా వార్తలు

Munugode by election will be decided future of politicians: మునుగోడు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న గ్రామంలో పార్టీకి తక్కువ ఓట్లు వస్తే టికెట్‌ గల్లంతయ్యే అవకాశముంది. ఇన్‌ఛార్జిగా ఉన్న గ్రామాల్లో పార్టీకి తక్కువ ఓట్లు వస్తే ఎమ్మెల్యే టికెట్‌పై ప్రభావం ఉంటుందనే భయం, రాజకీయ భవిష్యత్తుపై బెంగ వేస్తోంది.

munugode by poll
మునుగోడు ఉప ఎన్నిక

By

Published : Oct 12, 2022, 12:05 PM IST

Munugode by election will be decided future of politicians: మునుగోడు నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలో పోటీ చేయడానికి ఇప్పటికే పలువురు నాయకుల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు నేను ఇన్‌ఛార్జిగా ఉన్న ఈ గ్రామంలో పార్టీకి తక్కువ ఓట్లు వస్తే నా టికెట్‌ గల్లంతయ్యే అవకాశముంది. అందుకే ఎంత ఖర్చయినా సరే! మన పార్టీ అభ్యర్థికి గ్రామంలో మెజార్టీ వచ్చి తీరాలి.చండూరు మండలంలోని ఓ గ్రామానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఒకరు, స్థానిక సర్పంచితో సహా ముఖ్య నాయకులతో అన్న మాటలివి.ఈ గ్రామంలో పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లపైనే నా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బూత్‌లో అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు మనకే రావాలి. ప్రతి బూత్‌లో కనీసం 300 ఓట్లు పడేలా చూడాలి. మీకేం కావాలో చెప్పండి.

అదండీ సంగతి. ‘ఎంకి పెళ్లి..సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా’ మునుగోడు ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల సంగతి ఎలాగున్నా..గ్రామాల్లో ఎన్నికల ఇన్‌ఛార్జులుగా ఉన్న ఆయా పార్టీల నేతలకు మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వారికి ఉప ఎన్నిక అగ్ని పరీక్షలా మారింది.

కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతూ..ఓ ప్రధాన పార్టీ ఎంపీటీసీ పరిధిలో ఒక ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జిగా నియమించింది. మరో పార్టీ ఒక్కో బూత్‌ పరిధిలో ఒక ముఖ్య నాయకుడికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. మరో ముఖ్య పార్టీ అయితే ‘ఈ ఎన్నికల్లో మీ పరిధిలో పార్టీకి వచ్చే ఓట్లను బట్టే మీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని’ అంతర్గతంగా వెల్లడించినట్టు తెలిసింది. వీటి పరిధిలో ఓటర్లు, స్థానిక నేతల ‘మంచీచెడ్డలు’ అంతా మీరే చూడాల్సి ఉంటుందని కూడా ఆయా పార్టీల అధినాయకత్వాలు ఆదేశించినట్టు సమాచారం. బాధ్యతలు అప్పగించిన ప్రాంతాల్లో అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి! అనే దాన్నిబట్టే తమ సామర్థ్యాలను పార్టీలు అంచనా వేసే అవకాశం ఉండటంతో రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రాకుండా నాయకులు జాగ్రత్త పడుతున్నారు. తమ పరిధిలో ఎలాగైనా పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చూసేందుకు తంటాలు పడుతున్నారు. ఓటరు జాబితా చేతపట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీకి వచ్చే ఓట్లపై అంచనా వేస్తున్నారు. తక్కువ వచ్చే అవకాశం ఉన్నచోట వైరిపక్షం నేతలకు గాలం వేస్తున్నారు. రాత్రివేళ మంతనాలు జరుపుతూ తెల్లవారే సరికి వారికి పార్టీ కండువాలు కప్పుతున్నారు. దానికోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడడం లేదు. ‘‘ఇక్కడ మా అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం పార్టీ అధిష్ఠానానికి ఉంది. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నా. నా పరిధిలో పార్టీకి ఎక్కువ ఓట్లు తీసుకువస్తేనే, నా రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది కేవలం పోటీచేసే అభ్యర్థులకు మాత్రమే కాదు, మాకూ కఠిన పరీక్షే’’నని ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న పలువురు నాయకులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details