రేపు హాలియాలో జరగబోయే ముఖ్యమంత్రి సభతో... నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఇంకా ఎన్నికల ప్రకటన రాకున్నా... అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అన్ని పార్టీలు తలమునకలైనట్లే కనపడుతోంది. ఏకకాలంలో 11 ఎత్తిపోతల పథకాలు, మరికొన్ని ఆధునికీకరణ పనులకు రూ.3 వేల కోట్ల మంజూరు చేసి... ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు ప్రజలకు సంకేతాలచ్చింది అధికార పార్టీ. ఈ పథకాలన్నింటికీ రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు వద్ద... ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మొత్తం పథకాలను సైతం... నెల్లికల్లు వద్దే ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్, హుజూర్నగర్, దేవరకొండ నియోజకవర్గాలకు... తాజా నిధుల ద్వారా లబ్ధి చేకూరనుంది. యాదాద్రి జిల్లాలో గంధమల్ల, బస్వాపూర్... సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీతోపాటు కొత్త లిఫ్టులు, ఇక నల్గొండ జిల్లాకు సైతం నూతన లిఫ్టుల ద్వారా లబ్ధి చేకూరుతున్నందున... ఉమ్మడి జిల్లా తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపేలా ధన్యవాద సభకు రూపకల్పన చేశారు. బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.
భారీ జనసమీకరణ..
బుధవారం మధ్యాహ్నం... ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం... సాగర్ బీసీ గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ దిగి రహదారి మార్గాన... నెల్లికల్లుకు చేరుకుని ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి సాగర్‌కు చేరుకోనున్న సీఎం... విజయ్ విహార్ లేదా గుత్తా సుఖేందర్ రెడ్డి క్వార్టర్స్‌లో కాసేపు ఆగి పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం... హెలికాప్టర్లో హాలియాకు చేరుకోనున్నారు. హాలియా పురపాలక సంఘం పరిధిలోని 14వ మైలు వద్ద సభా ప్రాంగణం నిర్మించగా... దానికి సమీపంలోనే హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇక సీఎం రాక దృష్ట్యా రెండు లక్షల మందిని సమీకరించేలా... పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని రప్పించేలా... కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించేలా... ఇప్పటికే శాసనసభ్యులందరికీ ఆదేశాలు అందాయి. సభ నిర్వహణను మంత్రి జగదీశ్ రెడ్డికి... నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు అప్పగించారు.